Mohammed Rafi | ఎంతవారైనా సరే ఆయన గాత్రం వింటే మైమరిచిపోవాల్సిందే!
దిలీప్ కుమార్ ఫుల్ ఖుషీ.. దేవానంద్ ఆనందానికైతే అవధుల్లేవ్! షమ్మీ మరింతగా ఊగిపోయాడు!! ఒకరేమిటి బాలీవుడ్ తొలి రెండు తరాల హీరోలంతా ఎంత పుణ్యం చేసుకున్నామో అని సగర్వంగా భావించారు.
Mohammed Rafi | ఓ ఎనిమిదేండ్ల కుర్రాడు… అలా వెళ్లిపోతున్నాడు. ఎక్కడికో తెలియదు? భిక్షాటనకు గ్రామానికి వచ్చిన ఫకీరు పాట ఆ బుడతణ్ని ఆకట్టుకుంది. అందుకే, అతని వెంటే కదిలాడు. నీడలా తిరిగాడు. మధ్యాహ్నానికి ఆ ఫకీరు ఊరు దాటేవాడు. ఈ కుర్రాడు నిదానంగా తండ్రి దుకాణానికి చేరేవాడు. అప్పటిదాకా ఫకీరు పాడిన పాటను అంతే శ్రావ్యంగా ఆలపిస్తూ గంటలు గడిపేవాడు. నిత్యం ఇదే తంతు! రోజూ అంగట్లోని వారంతా ఆ కుర్రాడి రాకకోసం ఎదురు చూసేవారు. పదేండ్ల ప్రాయంలో తన మనోహర గాత్రంతో ఆబాలగోపాలాన్నీ అలరించిన ఆ బాల గంధర్వుడే ఆ తర్వాత యావత్ భారతాన్నీ వశపర్చుకున్న మహమ్మద్ రఫీ. దాదాపు మూడు దశాబ్దాలు తన అమృతగానంతో ప్రతి మదినీ పులకింపజేసిన మేటి గాయకుడి 43వ వర్ధంతి రేపు. ఈ సందర్భంగా రఫీ కీ యాదే..
దిలీప్ కుమార్ ఫుల్ ఖుషీ.. దేవానంద్ ఆనందానికైతే అవధుల్లేవ్! షమ్మీ మరింతగా ఊగిపోయాడు!! ఒకరేమిటి బాలీవుడ్ తొలి రెండు తరాల హీరోలంతా ఎంత పుణ్యం చేసుకున్నామో అని సగర్వంగా భావించారు. ఎందుకంటే ఈ హీరోలందరూ రఫీ గాత్రాన్ని అరువు పొందినవాళ్లే! సంగీత దర్శకుడు నౌషాద్ మరింత జటిలమైన స్వరాలు కూర్చడానికి ఎంత కష్టపడ్డాడో? ఓపీ నయ్యర్ ఓపికగా విభిన్న ట్యూన్లను కంపోజ్ చేయడం మొదలుపెట్టాడు! కారణం ఏ దివ్యలోకంపైనో అలకబూని మానవుడిగా జన్మించిన రఫీ అందుబాటులో ఉన్నప్పుడే తమలోని స్వర సారస్వతాన్నంతా రంగరించి బాణీలు కట్టాలనే తపన వారిది!! వారందరి సంగతీ తన మార్కు సంగతులు వేసి మైమరిపింపజేసేవాడు రఫీ. నౌషాద్-రఫీ జంట స్వరాలు సుమధురంగా కుదిరిన చిత్రాల్లో ఒకటి 1952లో విడుదలైన ‘బైజూ బావ్రా’! ఇందులో ప్రతి పాటా మనోహరమే! ‘ఓ దునియా కే రఖ్వాలే.. సున్ దర్ద్బరే మేరే నాలే..’ పాటలో రఫీ పలికించిన డైనమిక్స్.. బైజూ కూడా నిజంగా అంతగా పరితపించాడా అన్న అనుమానం కలిగిస్తాయి. ఇందులోని ‘మన్ తడపత్ హరిదర్శన్ కో ఆజ్..’ పాట భజన గీతమై ఇప్పటికీ ఉత్తరాది రాష్ర్టాల్లోని దేవాలయాల్లో మార్మోగుతూనే ఉంటుంది.

రఫీ రాకకు ముందు ప్లేబ్యాక్ విధానం చాలా పరిమితంగా ఉండేది. చాలామంది హీరోలు ఎవరికి వారే పాడుకునేవారు. ప్లేబ్యాక్ విధానం వచ్చిన తొలినాళ్లలో రఫీ గళమెత్తాడు. హీరో మాటతీరు, హావభావాలు, పాత్ర తీరుతెన్నులను గమనించేవాడు. పాటను, పాత్రను, దాన్ని పోషిస్తున్న నటుణ్ని ఆకళింపు చేసుకొని ఒక్కో హీరోకు ఒక్కోవిధంగా గొంతు సవరించేవాడు. ఈ వరుసలో ముందుగా షమ్మీకపూర్ ఉంటాడు. ఉరిమే ఉత్సాహం షమ్మీ సొంతం. కొండగాలిలా పాట ఊపుమీదుంటే ఆ హీరో తెగ ఊగిపోయేవాడు. పిల్లగాలిలా ఉంటే తనువంతా మల్లెతీగలా మెలికలు తిప్పేసేవాడు. క్షణం కుదురుగా ఉండని అతగాడు ఏ పాటకు ఎలా నర్తిస్తాడో, ఏ పదానికి ఎలా స్పందిస్తాడో.. అచ్చంగా అలాగే పదాలు పలికించి విస్మయపరిచేవాడు రఫీ. అందుకే కాబోలు, రఫీ మరణవార్త వినగానే షమ్మీ ‘ఐ లాస్ట్ మై వాయిస్..’ అని కదలక, మెదలక కాసేపు నిశ్చేష్టుడయ్యాడు. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘చాహె కోయీ ముఝే జంగ్లీ కహే… ’, ‘దీవానా హువా బాదల్..’, ‘ఆజా ఆజా మే హూ ప్యార్ తేరా..’ ‘దిల్ తేరా దివానా హై సనమ్..’ ఇలా ప్రతి పాటా ఎవర్గ్రీన్ లిస్ట్‌లో చేరిందే!
చెబుతూపోతే.. ఈ పాటల పల్లకీ ఆగేదెక్కడ? రఫీ గళసీమలోని కుసుమాలు చేర్చి వంద గజమాలలు కూర్చినా.. మరో తాజా పాట మనకు ఇంపుగా వినిపిస్తూనే ఉంటుంది. అందుకే, రఫీ అస్తమించిన పదేండ్లకు వచ్చిన ఓ సినిమాలో.. ‘నా ఫన్కార్ తుఝ్సా తేరే బాద్ ఆయా.. మహమ్మద్ రఫీ తూ బహుత్ యాద్ ఆయా’ అని కీర్తించారు. ‘ఏక్ ఇంసాన్ హూ.. మై తుమ్హారీ తరాహ్..’ అని రఫీ తనదైన శైలిలో వినమ్రంగా చెప్పినా… ‘తారీఫ్ కరూ క్యా ఉస్కీ జిస్నే తుమ్హే బనాయా’ అని రఫీసాబ్ను భువికి పంపిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేం!!
తెలుగులో కొన్ని..
హిందీ, పంజాబీ, మరాఠీ తదితర భాషల్లో వేల పాటలు ఆలపించిన రఫీ తెలుగులోనూ కొన్ని గీతాలు ఆలపించారు. అవన్నీ సూపర్‌హిట్ జాబితాలో చేరిపోయాయి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘భలేతమ్ముడు’ సినిమాలో ‘ఎంతవారు గానీ వేదాంతులైన గానీ..’, ‘ఇద్దరి మనసులు ఒకటాయే సరిహద్దులు లేనే లేవాయే..’, ‘గోపాల బాల నిన్నే కోరి..’ పాటలు బహుళ జనాదరణ పొందాయి. ఎన్టీఆర్ ‘ఆరాధన’ సినిమాలో ‘నా మది నిన్ను పిలిచింది గానమై..’ పాట ఈ తరాన్నీ మురిపిస్తుంది. ‘అక్బర్ సలీం అనార్కలీ’ సినిమాలోని ‘సిపాయి నీకై ఎంత ఎంత వేచి ఉన్నానో..’ పాట యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

