Michael Jackson | ప్రముఖ పాప్ ఐకాన్ మైఖేల్ జాక్సన్‌పై వచ్చిన పిల్లల లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆ తర్వాత జరిగిన సంచలన కోర్టు విచారణ ఆధారంగా రూపొందించిన ‘మైఖేల్ జాక్సన్: ది వర్డిక్ట్’ అనే సరికొత్త డాక్యు-సిరీస్ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన 2005 నాటి ఈ కోర్టు విచారణ నేపథ్యంలో మొత్తం మూడు భాగాలుగా ఈ డాక్యు-సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఈ సిరీస్‌లో అప్పట్లో కోర్టు గదిలో ఉన్న కీలక వ్యక్తుల సాక్ష్యాల ఆధారంగా విచారణ లోపలి కథను చూపించబోతున్నారు. ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండు వైపుల వాదనలను వినిపిస్తూ, విచారణను ప్రత్యక్షంగా చూసిన జ్యూరీ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు, ఆరోపణలు చేసిన బాధితులు మరియు జాక్సన్‌ను సమర్థించిన వారి నిజమైన ఇంటర్వ్యూలను ఇందులో పొందుపరిచారు. అప్పట్లో కోర్టు రూమ్‌లోకి కెమెరాలకు అనుమతి లేకపోవడంతో, ఆ మూసి ఉన్న తలుపుల వెనుక అసలు ఏం జరిగిందో ప్రపంచానికి స్పష్టంగా చూపించడమే ఈ సిరీస్ లక్ష్యమని దర్శకుడు నిక్ గ్రీన్ తెలిపారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన మైఖేల్ జాక్సన్ బయోపిక్ సినిమా ‘మైఖేల్’ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న తరుణంలో, నెట్‌ఫ్లిక్స్ ఈ సంచలన డాక్యుమెంటరీ ట్రైలర్‌ను తీసుకురావడం విశేషం.