Livia Voigt | యువత అనుకోవాలే గానీ ఈ భూమ్మీద ఏదైనా సాధించి తీరుతారనేది జగమెరిగిన సత్యం. ఉక్కు నరాల యువత బాణం ఎక్కు పెడితే ఎంతటి లక్ష్యమైనా వారి పాదాక్రాంతం కావాల్సిందే. వ్యాపార రంగంలో కాకలు తీరిన వారికేనా… కుబేరులన్న పేరు మాకెందుకు ఆ బిరుదు అతీతం అనుకున్నారో ఏమో అత్యంత సంపన్నుల జాబితాలో యుక్త వయసులోనే చేరిపోయారు.
ఇంకా ఆసక్తికరం ఏమంటే ఆ యువ బిలియనీర్లందరిలో టీనేజ్ యువతి మొదటి స్థానం పొందడం! ఔను, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా ఓ 19 ఏండ్ల బ్రెజిల్ విద్యార్థిని తన పేరును సుస్థిరం చేసుకున్నది. ఆమెతోపాటే చాలామంది యువ వారసులు ఇటీవల ఈ కోటీశ్వరుల వరుసలో చేరిపోయారు. 2024 ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా ప్రకారం.. బ్రెజిల్‌కు చెందిన 19 ఏండ్ల విద్యార్థిని లివియా వోయిగ్ట్ ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్ టైటిల్‌ను సాధించింది.
లివియా నికర ఆదాయం విలువ 1,10 కోట్ల డాలర్లు. వయసులో తన కన్నా రెండు నెలలు పెద్దయిన క్లెమెంట్ డెల్ వెచియోను అధిగమించి ఈ స్థానాన్ని పొందింది లివియా. ఈమె ప్రస్తుతం బ్రెజిల్‌లోని విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తూనే.. లాటిన్ అమెరికాలోని ప్రముఖ ఎలక్ట్రికల్ మోటార్ల తయారీ కంపెనీ వెగ్ (WEG) భాగస్వాముల్లో అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతున్నది. ఈ కంపెనీ వ్యవస్థాపకుల్లో లివియా వోయిగ్ట్ తాత వెర్నర్ రికార్డో వోయిగ్ట్ భాగస్వామిగా ఉండటం గమనార్హం. 2024లో అత్యంత చిన్న వయసు బిలియనీర్ జాబితాలో చేరిన మొదటి ఏడుగురిలో లివియా అక్క డోరా వోయిగ్ట్ డి అస్సిస్ కూడా ఉండటం విశేషం.