మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పుట్టినరోజును పురస్కరించుకొని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో వారిద్దరూ గిరిజన వేషధారణలో కనిపిస్తున్నారు. శ్రీకాళహస్తి పురాణ కథ ప్రాముఖ్యతను చాటిచెప్పే పాటలో పిల్లలిద్దరూ కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది.
‘పాట పాడినా, నృత్యం చేసినా, ఇది శివుడి కోసం’ అని ఫస్ట్‌లుక్ పోస్టర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు ఓ పోస్ట్ చేశారు. ‘ఈ క్షణం నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతున్నది. నా చిన్ని తల్లులు తెరపై సృష్టించే మ్యాజిక్‌ను చూసేందుకు నేను ఎంతగానో ఎదరుచూస్తున్నా’ అని అన్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్‌లాల్, శరత్‌కుమార్, మోహన్‌బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి అగ్ర నటులు భాగమవుతున్న విషయం తెలిసిందే.