వచ్చే సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. వింటేజ్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన ఈ సినిమా కోసం మెగాభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, చిరంజీవి తనదైన శైలి వింటేజ్ కామెడీతో అభిమానుల్ని అలరిస్తారని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో అగ్ర హీరో వెంకటేశ్ కీలకమైన అతిథి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. చిరు-వెంకీ కాంబో ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.