కొన్నిసార్లు పొగడ్తల్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి విషయంలో అదే జరిగింది. ఆయన తాజా సినిమా ‘2018’ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు జూడో ఆంథోనిని ఉద్దేశించి మమ్ముట్టి మాట్లాడుతూ “ఆయన తలపై వెంట్రుకలు లేకపోయినా, అద్భుతమైన తెలివితేటలున్న దర్శకుడు’ అని అన్నారు. మమ్ముట్టి మాటలు బాడీషేమింగ్ చేసినట్లుగా ఉన్నాయంటూ విమర్శలొచ్చాయి.
ముఖ్య ంగా సోషల్మీడియాలో ఆయన మాటలు వైరల్గా మారాయి. సీనియర్ నటుడు అలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో సోషల్మీడియా వేదికగా మమ్ముట్టి క్షమాపణలు చెప్పారు. దర్శకుడిని పొగిడే క్రమంలో తాను అలా మాట్లాడానని, తన మాటల వెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని అన్నారు.
‘నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అందుకు క్షమాపణలు కోరుతున్నా. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతా’ అని మమ్ముట్టి పేర్కొన్నారు. 2018 కేరళ వరదల నేపథ్యంలో ‘2018’ చిత్రాన్ని రూపొందించారు. జూడో ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించారు.