‘హైదరాబాద్‌తో నా అనుబంధం బలమైనది. ఇక్కడ స్నేహభావం ఎక్కువ. ఫుడ్ బావుంటుంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నా నమ్మకం. అక్టోబర్‌లో నా తెలుగు సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ రాబోతోంది. అప్పుడు మళ్లీ కలుద్దాం’ అని నటుడు నిర్మాత ఫహాత్ ఫాజిల్ అన్నారు. దిలేష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లతో కలిసి ఆయన నిర్మించిన మలయాళం బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’. ఈ సినిమా ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’గా తెలుగులో విడుదల కానున్నది. నివిన్ పౌలీ, మమితాబైజు జంటగా నటించిన ఈ చిత్రానికి గిరీష్ ఏడీ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ నెల 4న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్లో ఫహాత్ ఫాజిల్ మాట్లాడారు.
‘ఇది నా తొలి తెలుగు మూవీ ఈవెంట్. ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. అందరికీ నచ్చుతుంది. తప్పకుండా చూడండి’ అని హీరో నవిన్ పౌలీ చెప్పారు. “ప్రేమలు’ మాదిరిగానే ఈ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులకు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాం’ అని దర్శకుడు గిరీష్ ఏడీ ఆశాభావం వెలిబుచ్చారు. ‘సక్సెస్ఫుల్ స్టార్సంతా కలిసి చేసిన సినిమా ఇది. మలయాళం వెర్షనే తెలుగులో పెద్ద హిట్. ఇప్పటికే 200 కోట్ల పైనే వసూలు చేసిన ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని మైత్రీ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేని అన్నారు. ఇంకా సంగీత్ ప్రతాప్, శ్యామ్మోహన్ తదితర చిత్రబందమంతా మాట్లాడారు.