టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ మహేష్ బాబు- నమ్రత జంట ఎప్పుడు చూడముచ్చటగా కనిపిస్తారు. వీరిద్దరిది ప్రేమ వివాహం కాగా, వారి మధ్య బంధం ఏర్పడడానికి కారణం వంశీ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కి మధ్య మంచి పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా ప్రేమ అటు నుండి పెళ్లిగా మారింది.
వంశీ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది. షూటింగ్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు.
దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వీరి బంధానికి గుర్తుగా గౌతమ్, సితార ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న నమ్రత తాజాగా తన భర్త మహేష్‌తో కలిసి ఫొటో షూట్ చేసింది. ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కూడా కెమెరా ముందుకు రావడం ఆసక్తిగా మారింది. ఓ మ్యాగజైన్ ఫోటో షూట్ నిమిత్తం మహేష్ మరియు నమ్రతలు కలిసి స్టైలిష్ డ్రెస్సింగ్ లో అదరగొట్టారు. చాలా కూల్ లుక్‌లో కనిపిస్తున్న మహేష్, నమ్రతని చూసి అందరు మైమరచిపోతున్నారు.