మహేశ్‌బాబు, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన కార్తికేయ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘వారణాసి’ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే ‘వారణాసి’ త్వరగానే పూర్తయినట్లని కార్తికేయ అభిప్రాయపడ్డారు. ఇంకా చెబుతూ “వారణాసి’ ప్రమోషన్లు గట్టిగానే ఉంటాయి. ఈ సినిమా ఇంగ్లిష్ వెర్షన్ కూడా రెడీ చేసే ఆలోచన ఉన్నది. ‘ఆర్ఆర్ఆర్’ మాదిరానే ‘వారణాసి’ని కూడా ఆస్కార్ స్థాయికి తీసుకెళ్తారా? అని చాలామంది అడుగుతున్నారు.
దానికి నా సమాధానం ఒక్కటే. అస్కార్ వరకూ వెళ్లడం ఆర్గానిక్‌గా జరగాలి. కావాలని చేస్తే జరగదు. రేపు సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల స్పందనను బట్టి మా నిర్ణయం ఉంటుంది’ అని తెలిపారు కార్తికేయ. ఇదిలావుంటే.. ‘వారణాసి’కి సంబంధించిన మహేశ్ వర్క్ మొత్తం పూర్తయిందని తెలుస్తున్నది. తాజాగా ఫ్యామిలీతో కలిసి మహేశ్ లండన్ వెళ్లారు. దీంతో ఎయిర్పోర్ట్ విజువల్స్ బయటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో మహేశ్ క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్నారు.
‘వారణాసి’లోని కొన్ని సన్నివేశాల్లో మహేశ్ 24ఏండ్ల యువకుడిగా కనిపిస్తారని తెలిసింది. ఆ లుక్ కోసం ఏఐ, గ్రాఫిక్స్.. ఇలా ఎలాంటి టూల్స్ వాడలేదని, కేవలం మేకోవర్ ద్వారానే ఆయన్ని యంగ్‌గా చూపించారని తెలిసింది. ప్రస్తుతం మహేశ్ క్లీన్ షేవ్ లుక్‌కి కారణం అదేనని వినికిడి. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: కేఎల్ నారాయణ, నిర్మాణం: శ్రీదుర్గా ఆర్ట్స్.