MagaDheera | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిన చిత్రం “మగధీర”, జూలై 31, 2009న ప్రేక్షకుల ముందుకు వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి టేకింగ్, కధనం, విజువల్స్‌తో తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. ‘చిరుత’తో మంచి ఆరంభం అందుకున్న రామ్ చరణ్, రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొడతాడని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ అప్పట్లో భారీగా, రూ. 40 కోట్లకుపైగా బడ్జెట్ ఖర్చు చేశారు. అప్పటి ట్రేడ్ వర్గాల్లో ఇది రిస్క్ అని భావించినా, ఆ నమ్మకాన్ని మగధీర అద్భుత విజయంగా నిలబెట్టింది. మొదట్లో సందేహించిన వారందరికీ షాక్ ఇచ్చేలా, మొదటి వారంలో నుంచే హవా కొనసాగింది.
1000 థియేటర్స్‌లో విడుదలైన మగధీర.. 77.60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అత్తారింటికి దారేది వచ్చే వరకు కూడా ఇండస్ట్రీ హిట్ ఇదే. థియేట్రికల్ బిజినెస్ చేసిన మొత్తము రూ.40.42 కోట్లు కాగా, ఫైనల్ గా బయ్యర్లకు రూ.37.54 కోట్ల లాభం రావడం అప్పటికి సినీ పరిశ్రమలో అరుదైన విజయంగా చరిత్రలో నిలిచింది. పోకిరి తర్వాత ఒక తెలుగు సినిమాకు భారీ స్థాయిలో షేర్ వసూలు చేయడం ఇదే. 16 ఏళ్ల తర్వాత కూడా ఈ చిత్రం సృష్టించిన ప్రభావం, రికార్డులు సినిమా ప్రియుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మగధీర విజయంతో రామ్ చరణ్ హీరోగా నిలదొక్కుకోగా, రాజమౌళి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మగధీరకి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నా కెరీర్ లో ఎక్కువ కష్టంగా అనిపించిన చిత్రం మగధీర. ఎందుకంటే అప్పటికి ఆ బడ్జెట్ చాలా ఎక్కువ. అదే విధంగా ఆ సినిమా చేసేటప్పుడు అంతే ఎంజాయ్ కూడా చేశాను అని చెప్పుకొచ్చారు. గ్రాఫిక్స్ విషయంలో నాకు అవగాహన కలిగింది ఆ చిత్రంతోనే అని రాజమౌళి స్పష్టం చేశారు. ఈ సినిమాలో, చరణ్ సరసన నాయికగా కాజల్ అగర్వాల్ అలరించింది. ఈ కథ అటు రాజుల కాలంలో .. ఇటు ప్రస్తుత కాలంలోను నడుస్తుంది. పైగా పునర్జన్మలతో ముడిపడి ఉంటుంది. తన కెరియర్లో తొలి అడుగులు వేస్తున్న చరణ్ ను ఈ సినిమా నిలబెట్టింది అని చెప్పాలి. కథాకథనాలతో పాటు, ఈ సినిమా కోసం కీరవాణి స్వరపరిచిన పాటలు కూడా సక్సెస్ కావడంతో మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రం విడుదలై నేటితో 16 ఏళ్లు కావడంతో మూవీకి సంబంధించిన జ్ఞాపకాలని నెమరవేసుకుంటున్నారు.