Actor Vishal – Lyca Productions | తమిళ నటుడు విశాల్, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య నడుస్తున్న వివాదంలో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లైకా ప్రొడక్షన్స్‌కు రూ.21.29 కోట్ల అప్పును 30% వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని విశాల్‌ను హైకోర్టు ఆదేశించింది.
అసలు ఏం జరిగిందంటే.. విశాల్ తన ‘విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ’ కోసం ఫైనాన్షియర్ జి.ఎన్. అన్బు చెళియన్ ‘గోపురం ఫిలిమ్స్’ వద్ద రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పును లైకా ప్రొడక్షన్స్ స్వీకరించి, విశాల్ తన అప్పు తీర్చే వరకు విశాల్ నిర్మించే సినిమా హక్కులన్నీ తమకు చెందే విధంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, విశాల్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. వీరమై వాగై చూడమ్ (తెలుగులో సామాన్యుడు) అనే సినిమా హక్కులను లైకాకు బదులుగా ఇతర సంస్థలకు అమ్మాడని లైకా ప్రొడక్షన్స్ ఆరోపించింది. దీంతో 2022లో లైకా ప్రొడక్షన్స్ ఈ వివాదంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
అయితే ఈ కేసును విచారించిన హైకోర్టు.. విశాల్ రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని, తన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు సూచించింది. అయితే విశాల్ ఈ ఆదేశాలను పాటించకపోవడంతో, లైకా ప్రొడక్షన్స్ కోర్టు ధిక్కరణ కేసును దాఖలు చేసింది. దీనిపై కోర్టు విశాల్‌ను మందలించి, తన ఆస్తుల వివరాలను దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో విశాల్ తన వద్ద ఉన్న 3 కార్లు, ఒక బైక్, రెండు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలతో పాటు ఇంటి లోన్ డాక్యుమెంట్లు సమర్పించారు. అయితే రెండున్నరేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం, మద్రాస్ హైకోర్టు లైకా ప్రొడక్షన్స్‌కు అనుకూలంగా తన తీర్పును వెల్లడించింది. దాదాపు రూ.21.29 కోట్ల అసలు మొత్తంతో పాటు 30 శాతం వడ్డీ, అలాగే న్యాయపరమైన ఖర్చులను కలిపి మోత్తం లైకాకు చెల్లించాలని నటుడు విశాల్‌ను ఆదేశించింది.