తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు మధు నంబియార్. ఇటీవల విడుదలైన ‘గంధర్వ’ చిత్రంలో ఆయన కీలక పాత్రలో మెప్పించారు. ఈ సందర్భంగా మధు నంబియార్ మాట్లాడుతూ ‘నా మాతృభాష మలయాళం. అయితే నేను పుట్టిపెరిగింది ఇక్కడే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తూనే ఎల్ఎల్బీ పూర్తిచేశా. స్వచ్ఛంద పదవీవిరమణ అనంతరం నటుడిగా మారాను. ‘క్వాబ్ సారే ఝాటే’ అనే హిందీ సినిమాలో నెగెటివ్ రోల్‌తో కెరీర్ మొదలుపెట్టా.
ఆ తర్వాత వివిధ భాషా చిత్రాల్లో నటించా. తెలుగులో చెక్, షాదీముబాకర్, ఈ కథలో పాత్రలు కల్పితం, మిషన్ 2020 చిత్రాలు నాకు పేరు తీసుకొచ్చాయి. ‘గంధర్వ’ చిత్రంలో పోషించిన సైంటిస్ట్ పాత్రకు మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా నటుడిగా నన్ను మరో మెట్టెక్కించింది. ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశాను కాబట్టి ఎక్కువగా పోలీస్, డిఫెన్స్, లాయర్ పాత్రలొస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా అన్నారు.