M.M Keeravani Emotional Speech | భారతీయ సినీ చరిత్రలో నాటు నాటు ఒక సంచలనం. కోట్లాది భారతీయుల కల నెలవేరింది. ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌కు నామినేషన్ దక్కించుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పిన ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుగానూ ఆస్కార్ అందుకుని చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ పటంపై నిలబెట్టింది. ప్రతీ తెలుగువాడు గర్వపడే క్షణమిది. ఆస్కార్ అవార్డును సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి, చంద్రబోస్ అందుకున్నారు. అనంతరం ఎమ్.ఎమ్ కీరవాణి తన ఆనందాన్ని పాట రూపంలో వ్యక్తపరిచాడు.
‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కైవలం చేసుకోవాలని. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసింది. నన్ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టింది. థ్యాంక్యూ కార్తికేయ. ఇలానే మరిన్ని చిత్రాలు చేసి ఇలాంటి ఘనతలు సాధ్యమయ్యేలా చేయాలి’ అంటూ వేదికపై ఎమోషనల్ అయ్యాడు కీరవాణి. ఇక చంద్రబోస్ ‘నమస్తే’ అంటూ తెలుగులో చెప్పాడు. నాటు నాటు పాటను అనౌన్స్ చేయగానే రాజమౌళి, ఆయన భార్య రమా సంతోషంతో భావోద్వేగానికి గురయ్యారు. కార్తికేయ దంపతులతో కలిసి గంతులేశారు. నాటునాటు పాట రిచ్ నెస్ కు కారణం రమ అని రాజమౌళి కొనియాడారు. ఈ పాటకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.
ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. దీనితో పాటుగా ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరి ఫిల్మ్‌కు కూడా అవార్డు వచ్చింది. ఇలా రెండు ఆస్కార్ అవార్డులు రావడంతో భారతీయ సినీప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.