నామ్.. ఫూల్ పతా.. తెలియదు.
పతి.. ఏమయ్యాడో తెలియదు.
పరపతి.. పదిమందీఏమనుకుంటారోనని బెంగ.
ఓ జాడలేని అమ్మాయి కథ ఇది.
నామ్.. జయ ఉరఫ్ పుష్పరాణి.
పతా.. తెలిసినా చెప్పదు.
పతి.. చెప్పాలనిపించదు.
పరపతి.. పదిమందీ మెచ్చుకునే స్థాయికి ఎదగాలి.
తన ఉనికి కోసం సాహసానికి పూనుకున్న అమ్మాయి కథ కూడా ఇదే!
ఇద్దరమ్మాయిల కథ.. ‘లాపతా లేడీస్’- జాడలేని మహిళలు. మార్చి 1న థియేటర్లో విడుదలైంది. చూసినోళ్లు బాగుందన్నారు. తెలిసినోళ్లకు తప్పకుండా చూడండి అని చెప్పారు. అప్పుడు ఎంత మంది చూశారో తెలియదు గానీ, నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైనప్పటి నుంచి ‘లాపతా లేడీస్’ రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నది. ఇందులో అంతలా వింత ఏముంది? ఈ సినిమాలో ఏదో ఉంది. ఈచిత్రం ఏదో సందేశం ఇచ్చింది. పైకి కనిపించదు కానీ.. లోతుగా చూస్తే‘లాపతా.. ఏదో చెప్పనయితే చెప్పింది’!
‘లాపతా లేడీస్’లో నవ్వులున్నాయి. ముఖ్యంగా ఫూల్ నవ్వు మనల్ని నవ్వించదు. ‘అయ్యో!’ అనిపిస్తుంది. పుష్ప నవ్వినప్పుడూ నవ్వు రాదు. ఎంతకు తెగించిందన్న కోపం వస్తుంది. ఈ సినిమాలో సరదా సన్నివేశాలెన్నో! భర్తతో కలిసి అత్తారింటికి మొదలుపెట్టిన ప్రయాణం ఆమెకు సరదాగానే అనిపిస్తుంటుంది. కానీ, చూస్తున్న మనకు మాత్రం ఏదో వెలితి. నవ వధువు బలికావడానికే వెళ్తుందేమోనన్న భయం వెంటాడుతుంది. బండి ఎక్కడం, పడవకు మారడం, బస్సెక్కడం వరకు బాగానే ఉంటుంది. భార్య నగలు తీసుకున్న భర్తను చూస్తే ఒళ్లు మండుతుంది. కట్టుకున్నవాడు కోరగానే క్షణం ఆలోచించకుండా నగలన్నీ ఇచ్చేసిన ఆమె అమాయకత్వం చూసి పాపం అనిపిస్తుంది. ఆపై రైలు ప్రయాణం.. ఫూల్కేమో గానీ, అప్పటికే ఆమెపై జాలితో ఉన్న ప్రేక్షకులకు మాత్రం కలవరం కలిగిస్తుంది. ఆ పిల్ల బతుకు ఏమవుతుందో అని గుండె బరువెక్కుతుంది.
ప్రేక్షకులు అనుకున్న దానికి భిన్నంగా ఓ చిత్రం జరుగుతుంది. దీపక్, ఫూల్ జంట ప్రయాణిస్తున్న రైలులోనే మరో రెండు కొత్త జంటలు. నవ వధువులందరూ ముఖాలపై ఘూంఘట్ (కొంగు) కప్పుకొనే ఉంటారు. అందరిదీ ఒకే సంప్రదాయ వస్త్రశ్రేణి. ఎవరు ఎవరో పోల్చుకోవడం కష్టమే! రాత్రి పది దాటుతుంది. ఓ ఊరొస్తుంది. దీపక్ కునికిపాట్లు పడుతున్న ఫూల్‌ను రైలు దిగమంటాడు. భర్తతో కదులుతుంది. మళ్లీ బస్సెక్కుతుంది. మధ్యరాత్రికి ఓ పల్లెకు చేరుకుంటుంది. ఇంట్లో వాళ్లంతా కొత్తజంటకు దిష్టితీస్తారు. కోడలమ్మ ముఖంపై ఉన్న ఘూంఘట్ తొలగిస్తుంది దీపక్ తల్లి. అక్కడుంది పుష్ప కాదు. వేరెవరో అమ్మాయి. ఇంకెవరో ఇల్లాలు. ఆమె పేరు జయ. దీపక్ ఇంట్లోవాళ్లకు పుష్పగా పరిచయం చేసుకుంటుంది.
ఇక్కడ రైలు ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. జయ భర్త.. ఘూంఘట్లో ఉన్నది తన భార్యే అనుకొని ఫూల్ భుజం తట్టి ‘స్టేషన్ వచ్చింది’ అని చెప్పి రైలు దిగుతాడు. ఫూల్ రైలు దిగేసరికి దీపక్ కనిపించడు. ఇందాక భుజం తట్టింది తన భర్తే అనుకుంటుందామె. తనకన్నా ముందే రైలు దిగిన భర్త ఎక్కడికి వెళ్లిపోయాడో అని స్టేషన్ అంతా వెతుకుతుంది. ఎక్కడా కనిపించడు. మరోవైపు రైలు వెళ్లిపోయినా జయ జాడ కనిపించదు. పరారైంది అనుకుంటాడు జయ భర్త. భార్య తప్పిపోయిందన్న బెంగ కన్నా.. పదిహేను తులాల బంగారం పోయిందని కస్సుబుస్సవుతాడు. ‘అది దొరకాలి.. దాని సంగతి చెప్తా’ అనుకుంటూ కోపంగా బయటికి వెళ్లిపోతాడు. ఆ సమీపంలోనే ఫూల్ భయంతో, బాధతో ప్లాట్‌పామ్‌పై కూలబడిపోతుంది.
ఒంటరి ఆడపిల్ల. కొత్తగా పెండ్లయిన ఆడపిల్ల. స్టేషన్ మాస్టర్‌ను కలుస్తుంది. ఆమె సమస్యను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతాడు. ఆమెకు సాయం చేయాలనే భావిస్తాడు. ‘మీ భర్త ఊరు ఏంటి?’ అని అడుగుతాడు. సమాధానం ‘తెలియదు’. ఎందుకు తెలియదు? ఏమో ఆమెకే కాదు.. చాలామందికి తెలియదు. భర్త ఏం చేస్తాడో తెలియదు. ఎలాంటి వాడో అస్సలు తెలియదు.
మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ తదితర హిందీ రాష్ర్టాల్లో నిరుపేద కుటుంబాల్లో నేటికీ ఇదే పరిస్థితి. పెద్దవాళ్లు నిశ్చయించడం.. పిల్లలు తలలు వంచడం ఇప్పటికీ షరామామూలే! ప్రేమించే పెండ్లి చేసుకోవాలని కాదు! పెద్దలు చూసినా.. పిన్నలు మాట్లాడుకుంటేనే కదా ముడి చక్కగా పడేది. ఆ మాటడిగితే పెద్దల దగ్గర సమాధానం ఉండదు. కట్నం సమర్పించుకోలేని నిరుపేద తండ్రులు గంతకు తగ్గ బొంత అని ఓ సంబంధం చూడటం, పెండ్లి కానిచ్చేయడం ఇప్పటికీ అక్కడే కాదు.. చాలాచోట్ల కామన్. అలా కుదిరిందే పుష్ప పెండ్లి. అందుకే ఆమెకు భర్త గురించేం తెలియదు. అతగాడు ఘూంఘట్ వేసుకోడు కాబట్టి ముఖం మాత్రమే తెలుసు.
ఆ ముఖంలో ఏం చూసిందో.. మంచోడని నమ్మింది. తనతో నవ్వుతూ చెప్పిన మాట ఒకటి గుర్తుంది. అది ‘ఐ లవ్యూ’! దానికే మురిసిపోయింది. ప్రేక్షకులు ఊహించినట్టు దీపక్ దొంగ సచ్చినోడు కాదు. తన వెంట వచ్చిన పుష్పను గౌరవంగా చూస్తాడు. తను విడిచి వచ్చి ఫూల్ కోసం ఆరాటపడుతుంటాడు. అయినా ఏం లాభం! తను ఏ స్టేషన్లో దిగిందీ దీపక్‌కు తెలియదు. పెండ్లినాడు దిగిన ఫొటో ఒక్కటే ఆధారం. దానిని పోలీసులకు చూపిస్తాడు. ఘూంఘట్ ధరించి ఉన్న ఫూల్ ముఖాన్ని ఏ ముఖం పెట్టుకొని వాళ్లు వెతకగలరు.
ఈ సమాజంలో మంచికి ఇంకా నెలవుంది. ఓ మంచి ఆడ మనిషి తోడు ఫూల్‌కు దొరుకుతుంది. జీవితాన్ని కాచి వడబోసిన ఆ మంచామె.. ఫూల్‌ను కూతురిగా భావిస్తుంది. ఆమె కథంతా విని.. దీపక్ దగుల్బాజీ అనీ, నీ నగలన్నీ కట్టుకొని ఉడాయించాడనీ నిందిస్తుంది. ఆ మాటలకు ముఖం చిన్నబుచ్చుకున్న నవ వధువును ఊరడిస్తూ.. లోపల ఎలా అనుకున్నా.. పైకి మాత్రం వస్తాడులే అని నమ్మకంగా చెబుతుంది. దీపక్ నివాసంలో పుష్ప చర్యలు వింతగా సాగుతుంటాయి. ఎవరికో ఫోన్ చేస్తుంది. తన నగలు కుదువపెట్టి ఏవేవో చేస్తుంటుంది. పోలీసులు ఆమెను అనుమానిస్తారు. గట్టిగా నిలదీస్తారు. ఆమె పుష్ప కాదనీ, జయ అని తీర్మానించుకుంటారు. ఆమె భర్త జాడ తెలుసుకొని అతనికి సమాచారం ఇస్తారు.
పుష్పను పోలీసులు అష్టదిగ్బంధనం చేస్తారు. పెండ్లిల్లు చేసుకొని నగలతో ఉడాయించే అమ్మాయిగా అనుమానిస్తాడు దీపక్. తన భార్యను ఏమార్చిందీ తనేనని అనుమానిస్తాడు. కానీ, జయ చొరవతో ఫూల్ జాడ తెలుస్తుంది. ఆమె ఉన్న రైల్వేస్టేషన్ మాస్టర్ ఫోన్ ద్వారా సమాచారం ఇస్తాడు. ఫూల్‌ను దీపక్ వాళ్లున్న ఊరు రైలు ఎక్కిస్తాడు. ఆమెను చేరదీసిన పెద్దమ్మ నిండుగా వీడ్కోలు పలుకుతుంది. గంటన్నర ప్రయాణం తర్వాత రైలు అత్తారింటి సమీపంలో ఉన్న స్టేషన్‌కు చేరుకుంటుంది. ఫూల్ రాకకోసం దీపక్ ఎదురుచూస్తుంటాడు. దీపక్ తనకోసం వేచి ఉంటాడని ఆమె భావిస్తుంది. అనుకున్నట్టే జరుగుతుంది. ఫూల్ కథ సుఖాంతం.
జయ భర్త స్టేషన్‌కు వస్తాడు. ఆమెను దుర్భాషలాడతాడు. తను అతని వెంట వెళ్లనంటుంది. అగ్రికల్చర్ ఫార్మింగ్‌లో పీజీ చేయాలని ఉందని చెబుతుంది. అందుకోసం డెహ్రాడూన్ వెళ్లాలనుకుంటుంది. మొదటి భార్యను పొట్టన పెట్టుకొని, కట్నం కోసం తనను పెండ్లాడిన భర్తను చీడపురుగులా చూస్తుంది. మొదట్లో జయను అనుమానించిన ఇన్స్పెక్టర్ ఆమెకు అండగా నిలుస్తాడు. పోలీస్‌స్టేషన్‌లోనే ‘నీ అంతు తేలుస్తానం’టూ వాగిన జయ భర్తను నాలుగు తన్ని తరిమేస్తాడు. దీపక్ కుటుంబం అంతా వచ్చి జయను డెహ్రాడూన్ సాగనంపుతుంది.
ఆమిర్‌ఖాన్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా రచయితలు బిప్లబ్ గోస్వామి, దివ్యనిధి శర్మ. ఈ చిత్రానికి ఆమిర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలు. ఫూల్‌గా నిరోషి గోయెల్ పెర్ఫార్మెన్స్ ముచ్చటనిపిస్తుంది. స్పర్శ్ శ్రీవాస్తవ్ పోషించిన దీపక్ పాత్రపై ఫస్టాఫ్‌లో అనుమానం, సెకండాఫ్‌లో అభిమానం కలుగుతాయి. జయగా ప్రతిభ రంత అదరగొట్టింది. అన్నిటికీ మించి పోలీస్ ఇన్స్పెక్టర్ శ్యామ్మనోహర్గా రవికిషన్ నటన నచ్చుతుంది.
‘లాపతా లేడీస్’ సాదాసీదా కథైతే కాదు. అలాగని అత్యద్భుతమైనదీ కాదు. మనసులు కలవని మనువులు, మనుషులు తెలియని మనువులు ఇలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీయొచ్చని హెచ్చరిస్తుంది. వీలు చూసుకొని ఒకసారి చూడండి. వీలైతే ఇంకోసారి చూడండి. రైల్వే స్టేషన్లో ఫూల్, ఆమెను ఆదరించిన పెద్దమ్మ మాటలు ఆలోచింపజేస్తాయి. ఆడపిల్లలపై సమాజంలో గూడుకట్టుకున్న దురుద్దేశాలు కొంతవరకైనా మలిపేస్తాయి!!