ఓటీటీ హిట్
కుటుంబస్థాన్
జీ5 : మార్చి 7, 2025
తారాగణం : మణికందన్, శాన్వీ మేఘన,ఆర్. సుందరరాజన్, ఆదన్ కుమార్, గురు సోమసుందరం తదితరులు
దర్శకత్వం : రాజేశ్వర్ కలిసామి
భారతదేశంలో మధ్యతరగతి వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. డబ్బు అవసరాలు, కష్టాలు, కన్నీళ్లు.. వీటితోనే జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. అందుకే.. ‘మిడిల్ క్లాస్’ కథలతో వచ్చే సినిమాలను భారతీయులు ఓన్ చేసుకుంటారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తారు. అలాంటి ఓ మిడిల్ క్లాస్ ఉద్యోగి కథే.. కుటుంబస్థాన్. మిడిల్ క్లాస్ జీవితాల్లో కామన్‌గా కనిపించే ఓ సింపుల్ పాయింట్‌కు కామెడీని టచ్‌చేస్తూ.. ఈ కథను నడిపించాడు దర్శకుడు. అప్పులు చేసే కొడుకును తల్లిదండ్రులు, ఉద్యోగం చేయని భర్తను భార్య ఎలా చూస్తుందో.. ఈ చిత్రంలో అంతర్లీనంగా చూపించాడు. కథలోకి వెళ్తే.. మధ్యతరగతి యువకుడైన నవీన్ (మణికందన్) ఓ యాడ్ ఏజెన్సీలో డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. అమ్మ సుబ్బలక్ష్మి, నాన్న మూర్తితో కలిసి ఉంటాడు. అమ్మకు తీర్థయాత్రలు చేయాలని ఉంటుంది.
కాబట్టి, డబ్బు అవసరం. ఇక నాన్న.. రియల్ ఎస్టేట్ అంటూ ఖాళీగా తిరుగుతుంటాడు. రూపాయి సంపాదించడు. ఇలా ఉండగా.. వెన్నెల (శాన్వీ మేఘన)ని కులాంతర వివాహం చేసుకుంటాడు నవీన్. ఆమెది తక్కువ కులమని నవీన్ కుటుంబసభ్యులు వారి ప్రేమపెళ్లిని అంగీకరించరు. మరోవైపు నవీన్ బావ రాజేంద్రన్.. అతణ్ని ఎప్పుడూ తక్కువగా చూస్తుంటాడు. దాన్ని సహించలేని నవీన్.. బావకన్నా ఉన్నతంగా ఉండాలని అనుకుంటాడు.
అప్పులు చేసి బైక్, కారు తీసుకుంటాడు. తన భార్యను సివిల్స్‌కి ప్రిపేర్ చేయిస్తుంటాడు. ఇలా ఉండగా.. అనుకోని పరిస్థితుల్లో నవీన్ ఉద్యోగం ఊడిపోతుంది. ఆ విషయం ఇంట్లో చెప్పకుండా.. కుటుంబపోషణ కోసం ‘లోన్ యాప్’ నుంచి డబ్బులు తీసుకుంటాడు. దాన్ని తీర్చడానికి మరో అప్పు. ఇలా.. ఒకదాని కోసం మరో అప్పు చేస్తూ.. అప్పుల ఊబిలో చిక్కుకుపోతాడు. మరి ఆ అప్పులు తీర్చడానికి నవీన్ ఏం చేస్తాడు? వ్యాపారం చేయాలన్న నవీన్ కోరిక నెరవేరుతుందా? ‘డబ్బే గొప్పది’ అనుకుంటూ.. నవీన్‌ను చిన్నచూపు చూసే రాజేంద్రన్ కళ్లు తెరుస్తాడా? అనేది మిగతా కథ.