Jr.NTR | ఎంత పెద్ద దర్శకుడైనా.. ఒక్క డిజాస్టర్ పడితే అవకాశం కోసం ఎదురు చూడక తప్పదు. దర్శకుడి వెనకాల కోట్లు కొల్లగొట్టిన సినిమాలున్నా.. ఒక్క ఫ్లాప్ అతన్ని కిందకి లాగేస్తుంది. అలాంటి టైమ్‌లో చేయి అందించే హీరో ఎవరైనా ఉంటే బాగుండూ అని తెగ ఆరాట పడుతుంటారు. కానీ అది అందరి విషయంలో జరగదు. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే వాళ్లు కథ వినడానికి టైమ్ ఇవ్వరు. పోనీ మీడియం రేంజ్ సినిమాలు చేద్దామంటే మనసొప్పదు. ఇలానే చాలా మంది దర్శకులకు ఏళ్లకు ఏళ్లు గడిచిపోతుంటాయి. అయితే త్రివిక్రమ్, కొరటాల శివలకు మాత్రం అరివీర భయంకర ప్లాప్‌లు పడ్డా.. నెలల గ్యాప్‌లోనే తారక్ వంటి గ్లోబల్ హీరోతో సినిమాలను పట్టాలెక్కించారు.
ఐదేళ్ల కిందట అజ్ఞాతవాసి రూపంలో త్రివిక్రమ్‌కు పెద్ద షాక్ తగిలింది. అప్పటి వరకు తెచ్చుకున్న పేరు, పెంచుకున్న పాపులారిటీ.. ఈ ఒక్క సినిమాతో బూడిదలో వేసిన పన్నీరయింది. ఈ షాక్‌తో ఎటూ తోచని పరిస్థితుల్లో ఉన్న త్రివిక్రమ్‌కు తారక్ భరోసా ఇచ్చాడు. నువ్వేం టెన్షన్ పడకు ఇదే ఏడాది మనం సాలిడ్ హిట్టు కొట్టబోతున్నామని వెన్నుతట్టి లేపాడు. చెప్పినట్లుగానే అరవింద సమేత వీర రాఘవతో త్రివిక్రమ్‌కు మరిచిపోలేని బ్లాక్ బస్టర్నిచ్చాడు.
ఇక అపజయమే ఎరుగుని దర్శకుడిగా పేరున్న కొరటాలకు గతేడాది రిలీజైన ఆచార్య ఓ పెద్ద మచ్చలా మిగిలిపోయింది. మెగాస్టార్‌ను, మెగావారసుడిని ఒకే స్క్రీన్‌పై చూపించి.. అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ కలలో కూడా బెదిరిపోయే సినిమానిచ్చాడు. అంతటి ఘోర పరాజయం పడిన తర్వాత ఏ దర్శకుడికైనా గ్యాప్ వస్తుంది. కానీ కొరటాలకు తారక్ ధైర్యమిచ్చాడు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. ఈ సారి మనం కొట్టే హిట్టుకు బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ రావాలంటూ.. దేవర షూటింగ్‌ను మొదలు పెట్టాడు.
ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి. కొరటాల ఈ సారి కసితో సినిమా చేస్తున్నాడని, ఇండియన్ సినిమా హిస్టరీలోనే నెవర్ బిఫోర్ రేంజ్లో యాక్షన్ సన్నివేశాలను చూపించబోతున్నాడట. ఏప్రిల్ 5న ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్స్ట్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇలా తారక్ దర్శకుడి ప్రతిభను తప్ప అతని గత సినిమా రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఇద్దరి దర్శకులకు మరో లైఫ్‌ను ఇచ్చాడు. త్రివిక్రమ్ దాన్ని సద్వినియోగం చేసుకుని బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. మరి కొరటాల ఏం చేస్తాడో చూడాలంటే మరో ఆర్నెళ్లు వేచి చూడాలి.