కన్నడ హీరో సుదీప్ నటించి శాండల్‌వుడ్‌లో ఘన విజయం సాధించిన ‘కోటి గొబ్బ’ సినిమా తెలుగులో ‘కోటికొక్కడు’ పేరుతో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి శివ కార్తీక్ దర్శకత్వం వహించారు. మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధా దాస్, ఆషిక రంగనాథ్ నాయికలుగా నటించారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 16న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..‘కమర్షియల్ ఎంటర్టైనర్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. కామెడీ, లవ్, యాక్షన్.. ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. 70 శాతం సినిమా చిత్రీకరణ విదేశాల్లో జరపడం ఈ చిత్ర ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సినిమా సిద్ధంగా ఉన్నా మంచి తేదీ కోసమే ఇప్పటిదాకా వేచి చూశాం’ అన్నారు.