ఆనంద్ రవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొరమీను’. ‘స్టోరీ ఆఫ్ ఇగోస్’ ఉపశీర్షిక. శ్రీపతి కర్రి దర్శకుడు. పెళ్లకూరు సమన్యరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీశారన్నదే చిత్ర కథ. ఓ డ్రైవర్, అహంకారి అయిన అతని యజమాని, ఓ పోలీస్ మధ్య నడిచే కథ ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నారు.
వినూత్న కథతో తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నిర్మాత సమన్యరెడ్డి తెలిపారు. ఆద్యంతం ఆసక్తినిరేకెత్తించే మలుపులతో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని హీరో ఆనంద్ రవి చెప్పారు. ఈ సినిమాలో నాలుగు పాటలు రాశానని గీత రచయిత పూర్ణాచారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.