‘తెలుగువారందరికీ ప్రామిస్ చేసి చెబుతున్నా. వెండితెరపై మునుపెన్నడూ చూడని ప్రేమకథను ‘చెన్నై లవ్‌స్టోరీ’లో చూస్తారు. చూస్తున్నంతసేపూ మీరంతా ఓ జీవితానికి అనుసంధానమవుతారు. ఓ అమ్మాయిని స్వచ్ఛంగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే భావన అందరికీ కలుగుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా కొన్ని రోజులు వెంటాడే కథ ఇది’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన భావోద్వేగ ప్రేమకథ ‘చెన్నై లవ్‌స్టోరీ’. శ్రీగౌరీప్రియ కథానాయిక. రవి నంబూరి దర్శకుడు. ఎస్కేఎన్, సాయిరాజేష్ నిర్మాతలు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన ఈ మూవీ లవ్ కార్నివాల్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. ఈ సినిమా కోసం ఏడాది పాటు కష్టపడ్డామని, స్టీవెన్, విధి ప్రేమకథ మామూలుగా ఉండదని, కిరణ్ అబ్బవరంతో కలిసి నటించడం గొప్ప అనుభవమని కథానాయిక శ్రీగౌరీప్రియ అన్నారు. నిర్మాతలు ఎస్కేఎన్, సాయిరాజేష్ ఈ చిత్రం నిర్మించడం పట్ల ఆనందం వ్యక్తంచేస్తూ, విజయం పట్ల నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఏపీ మంత్రి కందుల దుర్గేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని కూడా మాట్లాడారు.