Kingston | ‘సముద్రతీరంలో ఓ ఊరు.. ఆ ఊరులో బతికే జాలర్లలో నేనూ ఒకడ్ని. సాధారణంగా జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్తుంటారు. కానీ ఆ ఊరిలో జాలర్లు వేటకు వెళ్లరు. కారణం ఓ శాపం. ఆ శాపం ఏంటి? శాపాన్ని ఎదిరించి హీరో సముద్రంలోకి ఎలా వెళ్లాడు? అక్కడ ఏం జరిగింది? అనేది ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇండియాలో వస్తున్న తొలి సీ అడ్వెండర్ థ్రిల్లర్ ఇది.’ అని తెలిపారు హీరో జీవి ప్రకాష్‌కుమార్. ఆయన కథానాయకుడి నటిస్తూ.. జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘కింగ్స్టన్’. కమల్ ప్రకాష్ దర్శకుడు.
గంగా ఎంటైర్టెన్మెంట్స్ అధినేత మహేశ్వర్‌రెడ్డి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవీ ప్రకాశ్‌కుమార్ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. సముద్రంలోకి వెళ్లాక హీరోలకు జాంబీలు ఎదురవుతారు. అలాగే ఆత్మలు కూడా వెంటాడతాయి. ఈ సాహసయాత్ర ఆద్యంతం ఉత్కంఠకు లోను చేస్తుంది. ‘బాహుబలి’ ప్రేక్షకులను రాజులకాలం నాటి ప్రపంచంలోకి తీసుకెళ్తే.. ‘కాంతారా’ ఓ స్పిరిచువల్ వరల్డ్‌ని ఆవిష్కరించింది. వాటి మాదిరిగానే ఈ సినిమా కూడా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అందరం ప్రాణం పెట్టి చేశాం. సాంకేతికంగా అద్భుతంగా ఉంటుందీ సినిమా.’ అని చెప్పారు జీవీ ప్రకాశ్‌కుమార్.