Chinni trailer | వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ, తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నటి కీర్తీసురేష్. ‘నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటి తెలుగు తనంతో కూడిన అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది. ‘మహానటి’ చిత్రంతో కీర్తీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘మహానటి’ విజయంతో ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. కీర్తీ కూడా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అక్కడే ఆమె పెద్ద పొరపాటు చేసింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని కథల గురించి ఆలోచించకుండా సినిమాలను చేసింది. అవి కాస్త ఫ్లాప్‌లుగా నిలిచాయి. మహానటి తర్వాత ఇప్పటివరకు కీర్తీ నటించిన ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. గతరెండేళ్ళుగా ఈమె హిట్టుకోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే కీర్తి తన పంతాను మార్చుకొని సైకో థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సాని కాదియం’. తెలుగులో ‘చిన్ని’ పేరుతో విడుదలవుతుంది. ప్రముఖ దర్శకుడు సెల్వారాఘవన్ మరో ప్రధాన పాత్రలో నటించాడు. అరుణ్ మతేశ్వరణ్ దర్శకత్వం వహించాడు. చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇటీవలే విడుదలైన టీజర్ అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
రివేంజ్ కథ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్‌ను గమనిస్తే సెల్వారాఘవన్, కీర్తి సురేష్ వరుస హత్యల చేసే సీరియల్ కిల్లర్లుగా కనిపిస్తున్నారు. అసలు వాళ్లు అలా హత్యలు చేయడానికి కారణమేంటి అనేది సినిమాలోనే చూడాలి. సెల్వారాఘవన్ ఇంట్రడక్షన్‌తో మొదలైన ట్రైలర్ తన పేరు, ఊరు, చేసిన హత్యల గురించి కానిస్టేబుల్‌కు వివరణ ఇస్తాడు. అదే విధంగా కీర్తి సురేష్ కూడా తన, పేరును తెలుపుతుంది. ‘ఎన్ని హత్యలు చేశావు’ అని కానిస్టేబుల్ అడుగుతుంటే ‘ఇరవై ఐదు హత్యలు చేశాను’ అని కీర్తి బదులు చెప్తుంది. దానికి కానిస్టేబుల్’ వాడు 24 అన్నాడు..లెక్క తేడాగుందే’ అనగానే, కీర్తి సురేష్ ‘ఇప్పుడున్న కోపంలో నీ వెన్నుముక లాగి నీ ఆసనంలో పొడిచి చంపేయాలనుంది. అదే నీతో కలిపి ఇరువై ఐదు’ అంటూ ప్రతీకారంతో రగిలిపోతున్నట్లు చెప్తుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం థ్రిల్లింగ్ ఫీల్‌ను కలిగిస్తుంది. యామినీ యజ్ఞమూర్తీ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, సెల్వా రాఘవన్ డీ గ్లామరైజ్ పాత్రలో అన్నా చెల్లెలుగా నటించారు. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో మే 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.