‘karthikeya | ప్రత్యేకంగా ఒకే జోనర్‌కు పరిమితం కాకుండా అన్ని రకాల ఇతివృత్తాలతో సినిమాలు చేస్తా. ప్రేక్షకుల అభిరుచులతో పాటు కథాంశాల సరళిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనిస్తుంటా. వాటికి అనుగుణంగానే కొత్త కథలు ఎంచుకుంటున్నా’ అని తెలిపారు కార్తికేయ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకుడు. 88 రామారెడ్డి నిర్మించారు. ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా కార్తికేయ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
గత సినిమాలకు పూర్తి భిన్నంగా ప్రచార చిత్రాల్లో చాలా కొత్తగా కనిపిస్తున్నారు?
ఇప్పటివరకు నేను టచ్ చేయని జోనర్ ఇది. ఇందులో ఎన్ఐఏ ఏజెంట్‌గా క్లాస్ పంథాలో ైస్టెలిష్‌గా నా పాత్ర సాగుతుంది. నా కామెడీ టైమింగ్ నవ్యరీతిలో ఉంటుంది. రెండున్నర గంటలు కొత్త ప్రపంచంలో విహరించిన అనుభూతిని కలిగిస్తుంది. ఆద్యంతం నవ్విస్తూనే తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠకు లోనుచేస్తుంది. పాత్రలు, వినోదం, యాక్షన్ అన్ని కథలో భాగంగానే ఉంటాయి తప్పితే అనవసరపు సన్నివేశాలు కనిపించవు.
ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేవి?
కామెడీ ప్రధానంగా సాగే యాక్షన్ చిత్రమిది. శ్రీ సరిపల్లి కథను చెప్పినప్పుడు అతడిలో కాన్ఫిడెన్స్, నిజాయితీ నచ్చి అంగీకరించా. నేను ఇప్పటివరకు యాక్షన్, ఎమోషనల్ పాత్రలు చేశాను. కానీ కామెడీ చేయలేదు. ఈ పాత్రలో నన్ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. రియల్‌లైఫ్‌లో అందరిపై పంచ్‌లు వేస్తూ సరదాగా ఉంటాను. ఆ స్వభావం నా పాత్రకు న్యాయం చేయడానికి ఉపయోగపడింది. బయట ఎలా ఉంటానో అలాగే సినిమాలో కనిపించా. ట్రైలర్ చూసిన వారందరూ నా కామెడీ టైమింగ్ బాగుందని అంటున్నారు.
ఎన్ఐఏ ఏజెంట్ పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు?
ఎన్ఐఏ అనగానే దేశసరిహద్దులతో ముడిపడిన కథలు గుర్తొస్తాయి. వాటికి భిన్నంగా దేశంలో అంతర్గతంగా తలెత్తే ఓ సమస్యను పరిష్కరించే ఏజెంట్‌గా నేను కనిపిస్తా. నేరపరిశోధనలో ఎన్ఐఏ వారు వ్యవహరించే తీరు, గన్ను పట్టుకునే విధానం తెలుసుకొని నటించా. తొలుత సినిమాకు వేరే టైటిల్ అనుకున్నాం. దర్శకుడి ఫోన్లో ఒకరోజు ‘రాజా విక్రమార్క’ అనే పేరు చూశా. మా కథకు సరిపోతుందనే ఆలోచనతో ఆ పేరును నేనే సెలెక్ట్ చేశా. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలని ఈ టైటిల్ పెట్టలేదు. చిరంజీవిగారి టైటిల్ మేము పెడుతున్నట్లుగా ఆయనకు చెప్పాం. ఆయన ఒకే అన్నారు.
కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
గత పరాజయాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ప్రతి కథను హీరోలా కాకుండా సాధారణ ప్రేక్షకుడిలా వింటున్నా. భవిష్యత్తును గురించి ఆలోచించకుండా చేస్తున్న సినిమాపైనే దృష్టిపెడుతుంటా. మార్కెట్ లెక్కలతో సంబంధం లేకుండా మంచి సినిమాలు చేయడానికే ప్రయత్నిస్తున్నా. ఇదివరకు చేసిన తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతున్నా.
ప్రీ రిలీజ్ వేడుకలో మీకు కాబోయే శ్రీమతి లోహితను అభిమానులకు పరిచయం చేశారు? ముందే ఆ సర్ప్రైజ్ను ప్లాన్ చేసుకున్నారా?
వేదికపై నేను ప్రపోజ్ చేసే విషయం లోహితకు ముందుగా తెలియదు. చాలా రోజులుగా తనతో ప్రేమలో ఉన్నా. కానీ ప్రాపర్‌గా ఎప్పుడూ నా ప్రేమను ఆమెకు వ్యక్తపరిచే అవకాశం దొరకలేదు. ఐ లవ్ యూ కూడా చెప్పలేదు. పెళ్లి అయిపోతే మళ్లీ ఆ అవకాశం రాదనిపించింది. మా ఇద్దరికి జీవితాంతం గుర్తుండిపోయే మంచి జ్ఞాపకంగా మిగిలిపోవాలని ప్రీ రిలీజ్ వేడుకలో తన పట్ల నాకున్న ప్రేమను వ్యక్తపరిచా.
లోహిత మీరు నటించిన సినిమాలన్నీ చూసిందా?
‘ఆర్ఎక్స్100’ సినిమాను తాను ఇంకా చూడలేదు. ఆ సినిమా విడుదలకు ముందు మేమిద్దరం గొడవ పడ్డాం. కొద్ది రోజులు మాట్లాడుకోలేదు. అందుకే తను ఆ సినిమా చూడలేకపోయింది. మళ్లీ కలుసుకున్న తర్వాత చూస్తానంటే నేనే వద్దన్నాను. ఎప్పుడైనా తాను సినిమా చూస్తానన్నా సెకండాఫ్ నుంచి చూడమని చెబుతా.
మీ ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు ఎప్పుడు చెప్పారు? వారిని ఎలా ఒప్పించారు?
మా ప్రేమ విషయం మూడు నెలల క్రితమే కుటుంబసభ్యులకు తెలిసింది. లోహితను ప్రేమిస్తున్న విషయం తొలుత మా ఇంట్లో వారికి చెప్పా. ఆ తర్వాత ఆమె కుటుంబసభ్యులను ఒప్పించాం. మా మధ్య ఉన్న స్నేహం, ప్రేమ గురించి చాలా కాలంగా అందరికి తెలియడం వల్ల ఎవరూ అడ్డు చెప్పలేదు. బీటెక్ చదువుతున్న రోజుల్లో లోహిత నాకు పంపించిన ఓ మెసేజ్ కారణంగా మా ఇంట్లో గొడవ జరిగింది. ఫ్రాంక్ అని అబద్ధం చెప్పి ఆ సమయంలో తప్పించుకున్నా. ఆ రోజు నాకు మెసేజ్ చేసిన అమ్మాయి లోహితనే అని ఇటీవల మా ఇంట్లో వాళ్లకు తెలిసింది. మా మధ్య ఉన్న సఖ్యత, అనుబంధాన్ని కుటుంబసభ్యులు అర్థంచేసుకొని పెళ్లికి అంగీకరించారు. హైదరాబాద్‌లో మా పెళ్లి జరుగుతుంది.
తదుపరి సినిమాల విశేషాలేమిటి?
యు.వి క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత క్లాక్స్ అనే నూతన దర్శకుడితో ఓ చిత్రాన్ని అంగీకరించా. శ్రీదేవి మూవీస్ సంస్థలో ఒక సినిమాను చేయాల్సివుంది.
‘వాలిమై’ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేస్తుండటంఎలా అనిపిస్తుంది?
ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తున్నా. కొత్త భాష, అజిత్ లాంటి స్టార్ నన్ను ఎలా స్వీకరిస్తారోననే సందేహంతో తొలి రోజు సెట్స్‌లో చాలా భయపడ్డా. కానీ అజిత్‌ను కలిసిన తర్వాత భయాలన్నీ పోయాయి. స్టార్ హీరో అనే భావన తనలో ఎప్పుడూ కనిపించదు. అందరితో కలివిడిగా ఉంటారు. ఇందులో నేను చేసిన బైక్ స్టంట్స్ కొత్తగా ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Karthikeya: కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
Karthikeya: కాబోయే భార్యని పరిచయం చేసిన కార్తికేయ.. అందరి ముందు ప్రపోజ్ చేసి షాకిచ్చాడు..!
అజిత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కార్తికేయ..
చిరంజీవి పాత టైటిల్స్ వాడుకున్న హీరోల లిస్ట్ ఇదే..!
సూపర్ స్టార్ కృష్ణతో పూరీ జగన్నాథ్ మూవీ.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?