Kapil Sharma | ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ పేరు ఈ ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. టెలివిజన్ రియాలిటీ షోలను అత్యంత విజయవంతంగా నడిపించడంలోనే కాదు, దేశ విదేశాల్లో వ్యాపారాలను విస్తరించడంలోనూ కపిల్ శర్మ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్తో పాటు బిజినెస్‌లోనూ కపిల్ దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కపిల్‌కు కెనడాలో ఉన్న ‘కాప్స్ కేఫ్’ ఇప్పటికే మంచి లాభాలతో విజయవంతంగా నడుస్తోంది. అయితే కొద్ది నెలల క్రితం కెనడాలో కొన్ని అరాచక శక్తుల కారణంగా కపిల్ శర్మ పేరు హాట్ టాపిక్‌గా మారింది. కపిల్‌కు చెందిన కెనడా కేఫ్‌పై గ్యాంగ్స్టర్ల కాల్పుల ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఘటనతో కపిల్ శర్మ భద్రత, వ్యాపారాలపై పెద్ద చర్చ నడిచింది.
అయినా సరే కపిల్ శర్మ తగ్గేదేలే అన్నట్లుగా తన వ్యాపారాలను మరింత విస్తరిస్తున్నారు. తాజాగా కెనడా తర్వాత తన రెండో ‘కాప్స్ కేఫ్’ను దుబాయ్‌లో ప్రారంభించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ కేఫ్‌ను గ్రాండ్‌గా ఓపెన్ చేశారు. డిసెంబర్ 31, 2025 అర్ధరాత్రి ముహూర్తంతో ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ కేఫ్ డిజైన్ కపిల్ పాపులర్ నెట్‌ఫ్లిక్స్ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ సెట్ వైబ్ నుంచి ప్రేరణ పొందింది. దుబాయ్ స్కైలైన్ బ్యాక్‌డ్రాప్‌తో కపిల్ శర్మ ఒక కప్పు కాఫీ చేతిలో పట్టుకుని కస్టమర్లను ఆహ్వానిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఓపెనింగ్ మరింత వైరల్‌గా మారింది. కెనడాలోని సర్రేలో ఉన్న కాప్స్ కేఫ్ తరహాలోనే, దుబాయ్ బ్రాంచ్ కూడా హాయిగా, ఆకర్షణీయంగా అలంకరించబడింది.
కాప్స్ కేఫ్ ప్రారంభ రోజున సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తుంది. దుబాయ్ బ్రాంచ్ మెనూ వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే కెనడాలోని కేఫ్‌లో ఇండో-వెస్ట్రన్ స్టైల్ ఫుడ్‌కు మంచి పేరు ఉంది. అక్కడ వడ పావ్, పాస్తా, వివిధ రకాల కాఫీలు, టీలు లభిస్తుండగా, విభిన్న రుచుల వంటకాలతో ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే డిజిటల్ రంగంలోనూ కపిల్ శర్మ తన హవా కొనసాగిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ నాల్గవ సీజన్‌కు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభించింది. ఈ షో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అత్యధికంగా వీక్షించబడిన టాప్ 5 నాన్-ఫిక్షన్ షోలలో రెండవ స్థానంలో నిలవడం విశేషం. నాల్గవ సీజన్‌లోని మొదటి రెండు ఎపిసోడ్లకు ప్రియాంక చోప్రా జోనాస్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.