Kantarar Chapter 1 | రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా అక్టోబర్ 2న పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చింది. ఇది 2022లో సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’కి ప్రీక్వెల్ కావడంతో ఈ సినిమాపై ముందు నుండే భారీ ఆసక్తి నెలకొంది. రిలీజ్‌కు ఒక రోజు ముందు నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల జాబితాలో చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. టికెట్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బుక్ మై షోలో 1.28 మిలియన్‌కి పైగా టికెట్లు అమ్ముడవడంతోనే దీని స్థాయి అర్థమవుతుంది. అంతేకాకుండా ఇతర టికెట్ యాప్స్, ఆఫ్‌లైన్ బుకింగ్స్ కలిపితే రికార్డ్ స్థాయిలో ప్రీసేల్స్ నమోదైనట్టు చెబుతున్నారు. రెండో రోజుకూడా గంటకు 70వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయంటే ఈ సినిమాకు ఎంతటి క్రేజ్ ఉందో తెలుస్తోంది. అన్ని భాషల్లోనూ ‘కాంతార చాప్టర్ 1’కు బ్రహ్మరథం పడుతూ భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. రివ్యూలు, రేటింగ్స్, మాట్ టు మౌత్ పాజిటివ్ టాక్ అంతా ఈ సినిమా హవాను మరింత పెంచుతున్నాయి.
అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాపై నెగటివ్ ప్రభావాన్ని చూపింది. విడుదలైన నాలుగు రోజుల్లో రూ.252 కోట్ల గ్రాస్ వసూలు చేశామని మేకర్స్ ప్రకటించినా, ఆ తర్వాత అధికారిక కలెక్షన్ అప్డేట్స్ వెలువడలేదు. దసరా స్పెషల్ హాలిడేస్ కారణంగా డీసెంట్ నంబర్లు వస్తే బ్రేక్ ఈవెన్ సాధ్యమేనని బయ్యర్లు భావించారు. కానీ అదే సమయంలో ‘కాంతార చాప్టర్ 1’ హవా పెరగడంతో ‘ఓజీ’ వసూళ్లు కాస్త దెబ్బతిన్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ఓజీ’ ఫస్ట్ వీక్ కలెక్షన్లు బాగానే ఉన్నా, లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ సాధించే పరిస్థితి కష్టంగా మారింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ బయ్యర్లకు లాభాల వరద రావాలంటే ఇంకా కొన్ని రోజులు గట్టి పోటీ ఇవ్వాల్సిందే. కాంతార ప్రీక్వెల్‌కు ప్రీమియర్ షోలు నుంచే సాలిడ్ టాక్ రావడం, అన్ని ఏరియాల్లో హౌస్‌ఫుల్ షోలు నమోదు కావడం, దసరా సెలవుల్లో కుటుంబాలతో పాటు యూత్ పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం వంటి అంశాలు ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.