మదన్, ఆశ, దివ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కంచుకోట’. ఆర్కే ఫిలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్నారు. ఎంఏ చౌదరి, వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. మంగళవారం ఈ చిత్ర టైటిల్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి. సముద్ర, నిర్మాతలు ఏ. గురురాజ్, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…‘ఇదొక చారిత్రక నేపథ్య సినిమా. 40 శాతం గ్రాఫిక్స్ ఉంటాయి. హీరో రాజశేఖర్ మేనల్లుడు మదన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాం. ఈ చిత్రంలో నేను గురూజీ పాత్రలో నటించాను. గాయని మంగ్లీ పాడిన ఒక పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తి చేశాం. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పృథ్వీ, సత్యప్రకాష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు’ అన్నారు.