Rajya sabha MP | తమిళ సినీ దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ ఒకేచోట కలుసుకున్నారు. దిగ్గజనటుడు కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సందర్భంగా ఈ శుభవార్తను తన స్నేహితుడితో పంచుకోవడానికి రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. ఈ విషయాన్ని కమలే స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు.
“నా స్నేహితుడు రజనీకాంత్‌కు రాజ్యసభ ఎంపీగా నా కొత్త ప్రయాణం గురించి తెలియజేశాను. ఎంతో సంతోషంగా ఉంది” అని కమల్ హాసన్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. దీనితో పాటు ఫొటోలను పంచుకున్నాడు. ఈ ఫోటోలలో కమల్ హాసన్ తన రాజ్యసభ ఎంపీ ఆర్డర్‌ను రజనీకాంత్‌కు చూపిస్తూ ఉండగా, మరొక ఫోటోలో వారిద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. మక్కల్ నీది మైయం (Makkal Needhi Maiam) పార్టీ అధినేత కమల్ హాసన్, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఒప్పందం ప్రకారం కమల్‌హాసన్‌ని రాజ్యసభకు నామినేట్ చేయడంతో పాటు ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది డీఎంకే.
సినిమాల విషయానికొస్తే, కమల్ హాసన్ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రజనీకాంత్ విషయానికొస్తే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తుండగా ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. అలాగే నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమా చేస్తున్నాడు.