Kajal | సినీ పరిశ్రమలో హీరోయిన్ల వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాలు, రిలేషన్షిప్ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లు ఎందుకు ఎక్కువగా సీరియస్ రిలేషన్‌షిప్‌లలో కనిపించరనే ప్రశ్నకు స్టార్ నటి కాజల్ అగర్వాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, సినీ నటీమణుల జీవనశైలి కారణంగానే అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు.హీరోయిన్లు తమకు క్రష్‌లు ఉన్నాయని చెబుతుంటారు. అయితే సీరియస్ రిలేషన్షిప్లో లేమని లేదా బాయ్‌ఫ్రెండ్ లేరని చెప్పడం గురించి యాంకర్ ప్రశ్నించగా, కాజల్ స్పందిస్తూ అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
అయితే ఒక హీరోయిన్గా ఆ పరిస్థితిని తాను బాగా అర్థం చేసుకోగలనని చెప్పిన ఆమె, “సీరియస్ రిలేషన్షిప్లో ఉండకపోవడానికి ప్రధాన కారణం సమయం లేకపోవడమే. షూటింగ్‌లు, ప్రయాణాలు, ప్రమోషన్లు ఇలా నిరంతరం బిజీ షెడ్యూల్ మధ్య వ్యక్తిగత బంధాలకు సమయం కేటాయించడం చాలా కష్టంగా మారుతుంది” అని వివరించారు.తన వ్యక్తిగత జీవితంలో ఉన్న క్రష్‌ల గురించి కూడా కాజల్ సరదాగా స్పందించారు. “ఎదుగుతున్న వయసులో క్రష్‌లు ఉండటం సహజం. నాకు కూడా కాలేజీ రోజుల్లో క్రష్‌లు ఉండేవి. ఆసక్తికర విషయం ఏమిటంటే వారు ఇప్పటికీ నా మంచి స్నేహితులుగానే ఉన్నారు” అని నవ్వుతూ చెప్పారు.
కాజల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ రంగంలో ఉన్న గ్లామర్ వెనుక నటీనటులు ఎదుర్కొనే ఒత్తిడి, సమయాభావం, వ్యక్తిగత జీవితానికి దూరమయ్యే పరిస్థితులను ఆమె మాటలు ప్రతిబింబిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కాగా కాజల్ అగర్వాల్ ప్రేక్షకులకు లక్ష్మీ కళ్యాణం, చందమామ సినిమాల ద్వారా పరిచయమయ్యారు. అనంతరం మగధీర సినిమాతో భారీ గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగారు. దశాబ్దానికి పైగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆమె, 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్నారు.