Ka Sequel |యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్లో పెద్ద మలుపు తీసుకువచ్చిన చిత్రం ‘క’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రం 2024 దీపావళి సందర్భంగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కంటెంట్ పరంగా ప్రశంసలు అందుకున్న ఈ మూవీ దాదాపు రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాల కృష్ణ నిర్మాణంలో, దర్శకులు సుజీత్ – సందీప్ ద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సినిమా క్లైమాక్స్‌లోనే సీక్వెల్‌కు హింట్ ఇచ్చిన మేకర్స్, అధికారికంగా రెండో భాగం ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీక్వెల్‌పై నిర్మాత చింతా గోపాల కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను నిర్మిస్తున్న ‘శ్రీ చిదంబరం గారు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ‘క’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చారు. నిర్మాత వెల్లడించిన వివరాల ప్రకారం ‘క’ సీక్వెల్ 2027లో విడుదలయ్యే అవకాశముందని, అదే దర్శక ద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని తెలిపారు. సీక్వెల్‌ను కూడా తానే నిర్మిస్తానని స్పష్టం చేశారు. అయితే హీరో విషయానికి వస్తే దర్శకుల నిర్ణయమే తుది మాట అవుతుందని, అవసరమైతే వేరే హీరోతో కూడా సినిమా చేసే అవకాశం ఉందని చెప్పారు. మొదటి భాగంలో ప్రేక్షకులు ఎక్కువగా కథ, కంటెంట్ గురించే మాట్లాడారని, అదే నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశానని నిర్మాత వివరించారు.
ప్రస్తుతం సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. 2027 జనవరి సమయంలో సినిమా విడుదల కావచ్చని సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో ‘క’ సీక్వెల్లో కిరణ్ అబ్బవరం కొనసాగుతాడా లేదా? అన్న సందేహం అభిమానుల్లో మొదలైంది. కథకు పూర్తిగా కొనసాగింపా లేక కొత్త కథతో వస్తారా అన్న ఆసక్తి కూడా పెరిగింది. మొత్తానికి ‘క’ సీక్వెల్‌పై వచ్చిన ఈ అప్డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.