తారక్ లైనప్ చూస్తే ఎవరైనా ‘వావ్..’ అనాల్సిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన కెరీర్ గ్రాఫ్ సమూలంగా మారిపోయిందని చెప్పక తప్పదు. దేశవ్యాప్తంగా తనకొచ్చిన గుర్తింపు కారణంగా, బాలీవుడ్ నిర్మాతలు సైతం తారక్ కోసం క్యూ కడుతున్నారు. ఓ రెండుమూడేళ్ల పాటు తారక్ డైరీ ఫుల్. ప్రస్తుతం ఆయన ‘దేవర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తొలిభాగం విడుదల కానుండగా, 2025 ప్రథమార్థంలో ‘దేవర2’ విడుదల చేయడానికి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ. ఇదిలావుంటే 2025 ప్రథమార్థంలోనే ఎన్టీయార్-ప్రశాంత్‌నీల్ సినిమా విడుదల కూడా ఉంటుందని సమాచారం.
ఈ సినిమా కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అలాగే, 2025 ద్వితీయార్థంలో ఆగస్ట్ 14న బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ను విడుదల చేయనున్నట్టు యాష్‌రాజ్ సంస్థ ప్రకటించింది. హృతిక్, తారక్ కలిసి నటించనున్న ఈ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న విషయం విదితమే. 2026 ప్రథమార్థంలో ప్రశాంత్‌నీల్ సినిమా రెండో భాగం విడుదల ఉంటుందట. ఇలా విరామం లేకుండా సినిమాలు చేస్తూ విడుదల తేదీలను కూడా దాదాపుగా ఖరారు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు తారక్. రానున్న ఈ పాన్ ఇండియా సినిమాలు తారక్‌ను ఏ స్థాయిలో నిలబెట్టనున్నాయో చూడాలి.