జనవరి 7న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి వరుస సర్ప్రైజ్లు ఇస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచారు. దోస్తి, నాటు నాటు సాంగ్‌లు విడుదల చేసి అలరించిన చిత్ర బృందంగా తాజాగా జనని అనే సాంగ్ విడుదల చేసింది.
కీరవాణి కంపోజ్ చేసిన ఈపాట ఆర్ఆర్ఆర్ ఎమోషన్‌కు అద్దం పడుతుంది. ఆర్ఆర్ఆర్ సోల్ ఆంథమ్ గా దీనిని రూపొందించినట్టు తెలుస్తుంది. కీరవాణి స్వరపరిచిన పాటకు ఆయనే సాహిత్యం అందించి ఆలపించారు. ఆద్యంతం భావోద్వేగంతో సాగిన ‘జనని’ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ ఎక్స్ప్రెషన్స్ ఉద్వేగభరితంగా ఉన్నాయి.
‘జనని’ సాంగ్ ఆర్ఆర్ఆర్ మూవీకి ఓ సోల్. ఈ సాంగ్ కోసం కీరవాణి రెండు నెలలు శ్రమించాడు. ఆయనే లిరిక్స్ అందించాడు. ఈ సాంగ్‌లో కనిపించని ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలా సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ ఎమోషనల్ లోనే దాగి ఉంటుంది అని రాజమౌళి స్పష్టం చేశారు.