Janaki V vs State of Kerala | గత కొన్నిరోజులుగా వివాదంలో నిలిచిన మలయాళం చిత్రం ‘జనకి వీ vs స్టేట్ ఆఫ్ కేరళ ఎట్టకేలకు థియేటర్లో విడుదలైంది. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈ సినిమాను మలయాళంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. పాన్ ఇండియా వైడ్‌గా గత నెల జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ బోర్డు వలన వాయిదా పడిన విషయం తెలిసిందే.
సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు జానకి అని ఉండడం వలన అది దేవత సీతకి మరోపేరు అని ఆ పేరుని తొలగించాలని సెన్సార్ బోర్డు కోరింది. దీంతో ఈ వివాదం గత కొన్నిరోజులుగా మలయాళం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచనల మేరకు నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను మార్చడానికి అంగీకరించారు. ‘జానకి వర్సెస్ కేరళ’ అనే పాత టైటిల్‌ను జానకి వీ vs స్టేట్ అఫ్ కేరళ అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఇటీవలే ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. అయితే విడుదల తేదీ మాత్రం ప్రకటించలేదు. ఇదిలావుంటే ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం మలయాళంతో పాటు హిందీలో మాత్రమే ఈ సినిమా విడుదల కాగా త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.