పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు అందరు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏ సినిమాలు బాగా అలరించాయి, ఏ సినిమాలు నిరాశపరిచాయి అని నెమరేసుకుంటున్నారు. అయితే గూగుల్ ప్రతి సంవత్సరం మాదిరిగానే గూగుల్ ఈ ఏడాది ప్రేక్షకులు అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాలో చోటు సంపాదించిన చిత్రాల జాబితాను పంచుకుంది.
ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జై భీమ్ సినిమా టాప్లో నిలిచింది. ఈ సినిమా జోరు ఇంకా ఏమాత్రం తగ్గలేదు. పైగా ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ మూవీ నామినేషన్స్ లోకి సూర్యను రెండవ సారి అడుగుపెట్టేలా చేసింది. 2020లో సూర్య నటించిన “ఆకాశం నీ హద్దురా” చిత్రం మొదటిసారి గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ లో నిలిచింది. ఇప్పుడు సూర్య “జై భీమ్” గూగుల్ సెర్చ్ 2021లోనూ టాప్ ప్లేస్ లో నిలిచి సూర్య ఖాతాలో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.
కాగా సిద్ధార్థ్ మల్హోత్రా “షేర్షా” రెండవ స్థానంలో, సల్మాన్ ఖాన్ నటించిన “రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్” మూడవ స్థానంలో నిలిచాయి. బెల్ బాటమ్, ఎటర్నల్స్, మాస్టర్, సూర్యవంశీ, గాడ్జిల్లా vs కాంగ్, దృశ్యం 2, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇక సినిమాలు మాత్రమే కాకుండా ఈ ఏడాది కొందరు సెలబ్రిటీల గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేశారు. వారిలో ఆర్యన్ ఖాన్, షెహనాజ్ గిల్, రాజ్ కుంద్రా, నటాషా దలాల్ ఉన్నారు.