ప్రతినాయకుడి పాత్రల్లో తనదైన విలక్షణ శైలితో రాణిస్తున్నారు సీనియర్ నటుడు జగపతిబాబు. ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’లో జగపతిబాబు క్రూరుడైన విలన్ రాజమన్నార్‌గా భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రశాంత్‌నీల్ (‘కేజీఎఫ్’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. సోమవారం జగపతిబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన చుట్ట పీలుస్తూ కళ్లలో క్రౌర్యాన్ని ప్రదర్శిస్తూ భయంకరంగా దర్శనమిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఇరవైశాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా షూటింగ్ పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమాలో జగపతిబాబు పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కథాగమనంలోని కీలకమైన మలుపునకు ఆయన పాత్రే కారణమవుతుంది. సినిమాలోని మిగిలిన పాత్రల లుక్స్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమా విడుదల తేదీని ఈ సంవత్సరాంతంలో తెలియజేస్తాం’ అన్నారు.