K. Raghavendra Rao | తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ప్రాజెక్ట్‌లు మొదలవుతున్నాయి. దీపా ఆర్ట్స్ ప్రొడక్షన్ నం.1గా రూపొందుతున్న ‘ఇరువురు భామల కౌగిలిలో’ చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండగా, అచ్యుత్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస గౌడ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన ప్రారంభోత్సవంలో, కె.రాఘవేంద్రరావు గారు స్క్రిప్ట్‌ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందజేశారు. ఈ సినిమాలో ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ త్రినాథ్ వర్మ హీరోగా నటిస్తుండగా వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. అక్షర గౌడ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ముహూర్తపు షాట్‌కి నిహారికా కొణిదెల క్లాప్‌నివ్వగా ప్రముఖ దర్శకులు బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్‌షాట్‌కి ప్రముఖ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, నిర్మాత, కెమెరామెన్ ఎస్.గోపాల్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘కమిటీ కుర్రాళ్లు’ దర్శకుడు యధు వంశీతో పాటు ఆ సినిమా నటీనటులు ‘టిల్లు స్క్వేర్’ దర్శకుడు మల్లిక్‌రామ్, దర్శకులు వర ముళ్లపూడి వంటి సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీతం– శీను భీట్స్, డి.ఓ.పి– శశాంక్ శ్రీరామ్, మాటల రచయిత– శ్రీధర్ సీపాన, ఎడిటర్– రాఘవేంధ్ర వర్మ, లైన్ ప్రొడ్యూసర్– సౌజన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్– సాయిరామ్ దేవర్ల, పి.ఆర్.ఓ– శివమల్లాలగా సాంకేతిక నిపుణులు వ్యవహరిస్తున్నారు.