Irumudi | మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండటమే కాకుండా.. సినిమాలోని కొన్ని పాత్రలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ధనలక్ష్మి టీచర్ పాత్ర సినిమా చూసిన తర్వాత కూడా ఆడియన్స్‌ను వెంటాడుతోంది. తెరపై తొలిసారి కనిపించినప్పుడే తన లుక్, చూపులు, నటనతో భయపెట్టిన ఈ పాత్రను చూసి చాలామంది ఆమె కొత్త నటి అనుకున్నారు. కానీ ధనలక్ష్మిగా కనిపించింది మాత్రం ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న స్వాసిక విజయ్. స్వాసిక విజయ్ కెరీర్ ఇప్పుడే మొదలైంది కాదు. 2009లో తమిళ చిత్రం ‘వైగై’ తో హీరోయిన్గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది. హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా.. కథలో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్‌కు కూడా ఆమె ప్రాధాన్యత ఇచ్చింది.
సినిమాలతో పాటు టెలివిజన్‌లోనూ పనిచేసిన స్వాసికకు కేరళలో మంచి గుర్తింపు ఉంది. ‘వసంతి’ చిత్రంలో ఆమె చేసిన పాత్రకు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ క్యారెక్టర్ నటిగా పురస్కారం కూడా లభించింది. స్వాసిక పేరు ఇటీవల తమిళ ప్రేక్షకుల్లో ఎక్కువగా వినిపించడానికి కారణం ‘లబ్బర్ పందు’. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో యశోద పాత్రలో స్వాసిక ఆకట్టుకుంది.హీరోకు జోడీగా పాటల్లో కనిపించే సాధారణ హీరోయిన్ పాత్ర కాకుండా.. కథలో కీలకంగా ఉండే పాత్రను ఆమె పోషించింది. తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అప్పటివరకు ప్రధానంగా మలయాళ ప్రేక్షకులకు పరిచయమైన స్వాసికను ‘లబ్బర్ పందు’ తమిళ ఆడియన్స్‌కు కూడా దగ్గర చేసింది.
ఇప్పుడు ‘ఇరుముడి’తో స్వాసికకు తెలుగులోనూ మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలో ధనలక్ష్మి టీచర్‌గా ఆమె ఎంట్రీనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆమె చూపులు, బాడీ లాంగ్వేజ్, నటనతో ఒక్కసారిగా సీన్ మొత్తం మూడ్‌ను మార్చేసింది. ఆమెను చూసిన ప్రతిసారీ ఏదో జరగబోతుందనే భయాన్ని కలిగించేలా దర్శకుడు శివ నిర్వాణ ఈ పాత్రను డిజైన్ చేశారు. ఒక దశలో ధనలక్ష్మి టీచరే సినిమాలో ప్రధాన విలన్ అనుకునేంతగా స్వాసిక తన నటనతో మెప్పించింది.సినిమా పూర్తయిన తర్వాత చాలామంది రవితేజ కథతో పాటు “ధనలక్ష్మి టీచర్‌గా నటించింది ఎవరు?” అంటూ సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో స్వాసిక పేరు తెలుగులో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. 2024లో నటుడు ప్రేమ్ జాకబ్‌ను వివాహం చేసుకున్న స్వాసిక.. పెళ్లి తర్వాత కూడా సినిమాలకు గ్యాప్ ఇవ్వలేదు. హీరోయిన్‌గానే నటించాలనే పరిమితులు పెట్టుకోకుండా తనకు నచ్చిన, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతుంది.