‘ఇరుముడి’ చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోకి అరంగేట్రం చేస్తున్నది బాలనటి బేబీ నక్షత్ర. ఈ సినిమాలో హీరో రవితేజ కూతురు మణికంఠ పాత్రలో నక్షత్ర కనిపించనుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా గురువారం బేబీ నక్షత్ర విలేకరులతో ముచ్చటించింది. ఈ సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని, తెలుగులో సొంతగా డబ్బింగ్ చెప్పానని నక్షత్ర తెలిపింది.
‘నా స్వస్థలం కేరళ. ఇప్పటికే మలయాళం, కన్నడ, తమిళంలో ఆరు సినిమాలు చేశాను. దర్శకుడు శివ నిర్వాణ ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ చూసి మా అమ్మను సంప్రదించారు. అలా ఈ సినిమాలో అవకాశమొచ్చింది. రవితేజగారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనతో పనిచేయడం హ్యాపీగా అనిపించింది. ఆయన సినిమాల్లో నాకు ‘విక్రమార్కుడు’ చాలా ఇష్టం. మా తల్లిదండ్రులు, టీచర్స్ సహకారం వల్ల చదువుతూనే సినిమాల్లో నటించగలుగుతున్నా’ అని బేబీ నక్షత్ర చెప్పింది.