అగ్ర నాయిక శృతిహాసన్ వ్యక్తిత్వం చాలా ప్రత్యేకం. ఏ విషయంలోనూ దాపరికం లేకుండా వ్యవహరిస్తుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ భామ తన కెరీర్ తొలినాటి సంగతుల్ని గుర్తుచేసుకుంది. తాను మంచి పొడగరి కావడంతో అంత ఎత్తు కలిగిన హీరోయిన్స్ రాణించడం కష్టమని చాలా మంది నిరుత్సాహపరిచారని చెప్పింది. ఇప్పుడు ఆ హైటే తనకు అవకాశాల్ని తెచ్చిపెడుతున్నదని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘నా హైట్ గురించి చేసిన కామెంట్స్ చాలా బాధపెట్టేవి. సినీ రంగంలో సక్సెక్ రాదని నిరుత్సాహపడిన సందర్భాలున్నాయి. ఇప్పుడాలోచిస్తే అదే హైట్ నాకు అడ్వాంటేజ్‌గా మారింది. మహేష్‌బాబు, ప్రభాస్ వంటి హీరోల సరసన అవకాశాలు రావడానికి నేను ఎత్తుగా ఉండటం ఎంతో ఉపయోగపడింది’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ‘వీర సింహారెడ్డి’ చిత్రాల్లో నటిస్తున్నది. ఈ రెండు సినిమాలు సంక్రాతికి ప్రేక్షకుల ముందుకురానున్నాయి.