అగ్ర కథానాయకుడు ప్రభాస్ ఇటీవలే ‘ఆదిపురుష్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అదే సమయంలో ఈ సినిమాలోని పాత్రల చిత్రణ, సంభాషణలపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై దృష్టిపెట్టారు. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో నటిస్తున్న ‘సలార్’ టీజర్‌ను జూలై 7వ తేదీన విడుదల చేయబోతున్నారని సమాచారం. ఇక నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సైంటిఫిక్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్-కె’ గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది.
ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను జూలై రెండో వారంలో విడుదల చేయబోతున్నారని తెలిసింది. ఇందుకు అమెరికా వేదిక కానుందని సమాచారం. హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో సూపర్‌హీరో కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం కావడంతో అమెరికాలో మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తే బాగుంటుందనేది చిత్ర బృందం ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘ప్రాజెక్ట్-కె’ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్నది. అమితాబ్‌బచ్చన్, దీపికా పడుకోన్, దిశా పటానీ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకానుంది.