‘ఎనిమిదేళ్లు అర్ధాకలితో కష్టపడ్డాను. ఆ కష్టానికి ప్రతిఫలంగా నలభైఏళ్ల కెరీర్ దక్కింది’ అన్నారు సీనియర్ విలన్ చరణ్‌రాజ్. ఆయన ‘నరకాసుర’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్దన్, సంకీర్తన విపిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకుడు. నవంబర్ 3న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చరణ్‌రాజ్ మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి రొటీన్ కేరక్టర్లు చేయకూడదని నిర్ణయించుకున్నాను. రొటీన్ విలన్ పాత్రలు వస్తుంటే చేయనని చెప్పేస్తున్నాను. మంచి పాత్ర అయితే డబ్బుతో ప్రమేయం లేకుండా నటిస్తా’ అన్నారు చరణ్‌రాజ్. ‘నరకాసుర’లో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని, అందుకే దర్శకుడి వెంటబడి మరీ ఈ పాత్రను తీసుకున్నానని చరణ్‌రాజ్ చెప్పారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే సినిమా ‘నరకాసుర’ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇంకా మంచి పాత్రలు చేయాలీ, ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలీ.. అదే తన లక్ష్యమని చరణ్‌రాజ్ చెప్పారు.