Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా హీరో అని నిరూపించుకున్నాడు. కేరళలోని ఒక పేద అమ్మాయికి బన్నీ చేసిన సహాయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్మీడియట్లో 92శాతం మార్కులు తెచ్చుకుని పై చదువులు చదువలేక ఇబ్బంది పడుతున్న ఓ మాలయాళి అమ్మాయికి బన్నీ సహాయం చేశాడు. నర్సింగ్ చదువుకోవడానికి తనకు సహాయం చేయమని మలయాళీ అమ్మాయి అలెప్పి కలెక్టర్ కృష్ణతేజను కలిసింది. ఆమె రిక్వెస్ట్ విన్న కలెక్టర్.. ఇదే విషయాన్ని అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి చెప్పాడట.
నర్సింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో సీటుకయ్యే ఖర్చు మొత్తం అల్లుఅర్జున్ భరిస్తానని హామి ఇచ్చాడట. అంతేకాకుండా ఆ అమ్మాయికి నాలుగేళ్ళ పాటు హాస్టల్ ఫీజును కూడా తనే భరిస్తానని బన్నీ కలెక్టర్‌కు చెప్పాడట. ఇదే విషయాన్ని కలెక్టర్ కృష్ణతేజ తన సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఆ అమ్మాయిని కాలేజీలో చెర్పించానంటూ ఫేస్బుక్లో వెల్లడించాడు. వియ్యార్ ఫర్ అలెప్పీ అనే స్లోగన్‌తో కలెక్టర్ చేపట్టిన ఈ మూమెంట్లో భాగంగా అల్లు అర్జున్ ఆర్థిక సాయం చేశాడు. ఈ వార్త తెలియగానే అల్లు అర్జున్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. రీల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ అల్లు అర్జున్ హీరోనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్‌కు టాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో మాలీవుడ్‌లోనూ అంతే ఉంది. బన్నీ నటించిన సినిమాలన్ని మాలీవుడ్‌లోనూ రిలీజై మంచి వసూళ్ళను సాధిస్తుంటాయి. గతేడాది వచ్చిన ‘పుష్ప’ తో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా ప్రతి చోట వసూళ్ళ వర్షం కురిపించింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.