Venkatesh | ‘సంక్రాంతికి వస్తున్నాం’ అపూర్వ విజయంపై చిత్ర కథానాయకుడు వెంకటేష్ ఆనందం వ్యక్తం చేశారు. అందరూ సినిమాను ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ హిట్ అంటున్నారని చెప్పారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 200కోట్ల వసూళ్లను దాటి బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతున్నది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెంకటేష్, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు.
పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. ఈ సినిమా చేస్తున్నప్పుడే పాజిటివ్‌గా అనిపించిందని, షూటింగ్ మొత్తం ఓ మ్యాజికల్ జర్నీలా సాగిందని వెంకటేష్ చెప్పారు. ‘ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసుంటే ఇంకా భారీ విజయం దక్కేది కదా?’ అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ‘నేను జీవితంలో ఎప్పుడూ ఏదీ అడగను. నా దగ్గరకు వచ్చిందే తీసుకుంటా.
నిజానికి ఈ విజయమే నాకు పెద్ద బోనస్’ అని బదులిచ్చారు. పదో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తున్నదని, కుటుంబ కథా చిత్రాలకున్న బలాన్ని మరోమారు ఈ సినిమా చాటిచెప్పిందని దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా తాను ప్రతి గడపకు చేరుకున్నానని, అమ్మలాంటి అందమైన జ్ఞాపకమిదని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఆనందం వ్యక్తం చేశారు.
నేను వైట్ వైట్: ఈ సమావేశంలో సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఐటీ రైడ్స్ గురించి స్పందించమని వెంకటేష్‌ను కోరగా ‘ఐటీ రైడ్స్ జరుగుతున్నాయా? నిజమా? ఆ విషయం నాకు తెలియదు. మిగతా వాళ్ల విషయాన్ని పక్కనపెడితే.. నేను పారితోషికం మొత్తం వైట్‌లోనే తీసుకుంటా. నేను వైట్ వైట్. నా రెమ్యునరేషన్ కూడా తక్కువే కదా’ అని వెంకటేష్ అన్నారు.