Hyper Aadi | మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మెగా మహోత్సవం వేడుకలు అభిమానుల్లో జోష్ నింపాయి. ఆగస్టు 20 రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, కమెడియన్ హైపర్ ఆది చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవిపై ఇటీవల వస్తున్న నెగెటివ్ ప్రచారానికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం చెబుతూ ఆయన మాట్లాడిన మాటలు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.వేదికపై ఉన్న దర్శకుడు బాబీ, జానీ మాస్టర్, నాగేంద్ర, ఆటా సందీప్, రమేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతూ హైపర్ ఆది తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా 90ల తరానికి చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని ఎంతో భావోద్వేగంగా వివరించారు.
మా జనరేషన్ చందమామను చూస్తూ తింది.. చిరంజీవిని చూస్తూ పెరిగింది. పవన్ కళ్యాణ్‌ను చూస్తూ అరిచింది.. రామ్ చరణ్‌ను చూస్తూ గర్వపడుతోంది అంటూ హైపర్ ఆది చెప్పిన మాటలకు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. చిన్నతనంలో తమ ఇంట్లో టీవీ లేకపోవడంతో పక్కింటికి వెళ్లి సినిమాలు చూసేవాళ్లమని, ఇతర హీరోల సినిమాలు అయితే మధ్యలోనే వచ్చేసేవాళ్లమని, కానీ చిరంజీవి సినిమా వస్తే మాత్రం చివరి వరకు చూసేవాళ్లమని గుర్తుచేశారు. గ్రీటింగ్ కార్డుల నుంచి హాస్టల్ గదుల్లో వేసుకునే పోస్టర్ల వరకు తమ జీవితంలో మెగాస్టార్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఈ తరం ప్రేక్షకులకు చిరంజీవి ఒక గొప్ప హీరో కావచ్చు కానీ, తమ 90ల జనరేషన్‌కు మాత్రం ఆయన వన్ అండ్ ఓన్లీ హీరో అని హైపర్ ఆది అన్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలందరికీ ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉన్నప్పటికీ, మెగా కుటుంబం నుంచి వచ్చిన ప్రతి హీరోకూ తొలి టికెట్ తీసిన అభిమాని మాత్రం మెగాస్టార్ అభిమానినేనని అన్నారు.
రికార్డులు ఎప్పటికప్పుడు మారుతుంటాయని, క్రికెట్లో పాత రికార్డులను కొత్త తరాలు అధిగమించినట్లే సినిమాల్లోనూ వసూళ్ల రికార్డులు మారతాయని చెప్పారు. కానీ చిరంజీవి డాన్స్, నటన, అభిమానుల ప్రేమ, సేవా గుణం వంటి అంశాల్లో ఆయన స్థాయిని ఇప్పటివరకు ఎవరూ అందుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.‘స్వయంకృషి’, ‘విజేత’, ‘ఆపద్బాంధవుడు’, ‘మగమహారాజు’ వంటివి కేవలం చిరంజీవి సినిమాల పేర్లు మాత్రమే కాదని, అవి ఆయన వ్యక్తిత్వానికి, జీవితానికి ప్రతిరూపాలని హైపర్ ఆది పేర్కొన్నారు.ఇతర హీరోల అభిమానులు వసూళ్లు, రికార్డుల గురించి గొప్పగా చెప్పుకుంటే, తమ హీరో ఇన్ని కోట్ల రూపాయల సహాయం చేశారని చెప్పుకునే స్థాయిని చిరంజీవి కల్పించారని కొనియాడారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు అండగా నిలవడం, చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందించడం వంటి విషయాలను కూడా గుర్తుచేశారు.
‘బలగం’, ‘కోర్టు’, ‘అర్జున్ సురవరం’ వంటి చిన్న సినిమాలకు చిరంజీవి అండగా నిలిచారని, సినీ పరిశ్రమలో ఎవరికైనా కష్టం వస్తే జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి అనే పెద్ద చెట్టు నీడలోకి వెళ్తారనే భావన అందరిలో ఉందని హైపర్ ఆది అన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో “చిరంజీవి తొక్కేశాడు” అంటూ జరుగుతున్న ప్రచారంపై హైపర్ ఆది ఘాటుగా స్పందించారు. చిరంజీవి ఎవరినీ వ్యక్తిగతంగా తొక్కలేదని, కొందరి అహాలను, అపోహలను మాత్రమే తొక్కుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించారని అన్నారు. ఎవరూ ఎప్పటికీ నంబర్ వన్‌గా ఉండలేరనే అహాన్ని చిరంజీవి తొక్కారని, బాలీవుడ్ కలెక్షన్ల గురించిన కొన్ని భ్రమలను చెరిపేశారని, డాన్స్ అంటే కేవలం నడవడమే అన్న ఆలోచనను మార్చేశారని వ్యాఖ్యానించారు. తన కొడుకు సక్సెస్ కాలేడనే అనుమానాలను సైతం అధిగమిస్తూ చిరంజీవి కుటుంబం నుంచి మరో తరం స్టార్‌ను తీర్చిదిద్దారని తెలిపారు.
తనపై ఎంత నెగెటివిటీ వచ్చినా చిరంజీవి స్థాయిని ఎవరూ తగ్గించలేరని హైపర్ ఆది స్పష్టం చేశారు. “ఎంతమంది ఆయనపై విమర్శలు చేసినా, అవి ఆయన వేసుకునే పంచె అంచును కూడా కదిలించలేవు” అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు.