Hrithik Roshan | సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం సౌత్ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రజినీకాంత్ కెరీర్లోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.హిందీ మార్కెట్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోయినా, ఉత్తరాదిలో కూడా అదే స్థాయి స్పందన లభించి ఉంటే ఈ చిత్రం సులభంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరేదనే అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి.
‘జైలర్’ బ్లాక్‌బస్టర్ విజయానంతరం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ సీక్వెల్‌ను ప్రకటించగానే అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ‘జైలర్ 2’ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలో ఒక కీలకమైన స్పెషల్ క్యామియో పాత్ర కోసం దేశవ్యాప్తంగా పలువురు స్టార్ హీరోలను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ ప్రత్యేక పాత్ర కోసం తొలుత నందమూరి బాలకృష్ణను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. మొదట్లో బాలయ్య ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరిగినప్పటికీ, చివరకు వివిధ కారణాలతో ఆ ప్రాజెక్ట్‌లో భాగం కాలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఆ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ను కూడా మేకర్స్ సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆయన బిజీ షెడ్యూల్స్, డేట్స్ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ సాధ్యపడలేదని టాక్.
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కూడా ఈ క్యామియో పాత్రకు సంబంధించి వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం రాజకీయ, వ్యక్తిగత, ఆరోగ్య కారణాలతో ఆయన ఈ ప్రాజెక్ట్‌కు దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగింది.తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రత్యేక పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పోషిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆయనపై కొన్ని సోలో సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం.రజినీకాంత్‌తో కలిసి హృతిక్ పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, అవి కూడా త్వరలో పూర్తికానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది.అయితే ‘కూలీ’లో అమీర్ ఖాన్ పాత్రకు మిశ్రమ స్పందన రావడంతో, ‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ పాత్రను దర్శకుడు నెల్సన్ ఎంత ప్రభావవంతంగా డిజైన్ చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.