Santosh Sobhan | ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఉంటారు. వాళ్లకు టాలెంట్ గుమ్మడికాయ అంత ఉన్నా కూడా అదృష్టం ఆవగింజంత ఉండదు. అందుకే వరుస ప్లాపులు వస్తూనే ఉంటాయి. కానీ అదేం విచిత్రమో వరుస అవకాశాలు కూడా వస్తూనే ఉంటాయి వాళ్లకి. ఈ లిస్టులో అందరికంటే ముందుండే హీరో సంతోశ్ శోభన్. కొన్ని సంవత్సరాలుగా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈ హీరో. కానీ థియేటర్లలో చెప్పుకోవడానికి ఒక హిట్టు కూడా లేదు. మారుతితో మంచి రోజులు వచ్చాయి, మేర్లపాక గాంధీతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ లాంటి సినిమాలు చేసినా కూడా ఈయన జాతకం మారలేదు.
ఏక్ మినీ కథ బాగానే ఆడినా అది థియేటర్ సినిమా కాదు.. కరోనా టైంలో ఓటీటీలో వచ్చింది. వెనకాల ప్రభాస్ అండగా ఉండటంతో సంతోశ్ శోభన్ వైపు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. గత రెండు సంవత్సరాల్లో సంతోశ్ శోభన్ నుంచి దాదాపు అరడజన్ సినిమాలు వచ్చాయి. అందులో ఒక్కటి కూడా విజయం సాధించలేదు.. కానీ అవకాశాలకు మాత్రం కొదవలేదు. ఇప్పుడు కూడా ఆయన చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అదే మిగిలిన హీరోలకు అర్థం కాని విషయం. ఒక్క ఫ్లాప్ వస్తేనే అవకాశాలు ఇవ్వడానికి నానా తంటాలు పడే ఇండస్ట్రీలో.. సంతోశ్ మాత్రం ఎలా సర్వైవ్ అవుతున్నాడనేది చాలామందికి అర్థం కావడం లేదు. గతంలో ఆది సాయికుమార్, రాజ్ తరుణ్ లాంటి హీరోలు కూడా కొన్ని సంవత్సరాలు ఇలాగే సినిమాలు చేశారు. ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది.
వాళ్లకు మార్కెట్ లేకపోయినా కూడా వాళ్లతో సినిమా చేస్తే కనీసం ఐదు కోట్ల వరకు డిజిటల్ శాటిలైట్ వర్కౌట్ అవుతుంది. థియేటర్ నుంచి డబ్బులు రాకపోయినా కూడా నాన్ థియేట్రికల్ రూపంలో వాళ్లకు పెట్టిన పెట్టుబడితో పాటు లాభాలు కూడా వస్తున్నాయి. సంతోశ్ శోభన్ లాంటి హీరోతో సినిమా చేయాలంటే రెండు నుంచి మూడు కోట్లు ఉంటే చాలు. ఒక పెద్ద నిర్మాణ సంస్థ నుంచి ఆ సినిమా వచ్చింది అంటే కచ్చితంగా దాని ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుగుతుంది. అలాగే ఓటీటీ రైట్స్ కూడా బడ్జెట్ కంటే ఎక్కువగా వస్తున్నాయి.
సంతోశ్ శోభన్ లాస్ట్ 2 ఇయర్స్ ట్రాక్ రికార్డు చూసుకుంటే వైజయంతి మూవీస్, యువి క్రియేషన్స్ లాంటి నిర్మాణ సంస్థల నుంచి వచ్చాయి. దాంతో వాటి బిజినెస్ కు ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు కూడా జోరుగా హుషారుగా షికారు పోదమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు సంతోశ్. థియేటర్స్ పరంగా డబ్బులు వచ్చినా రాకపోయినా డిజిటల్ రూపంలో బయట పడుతున్నారు కాబట్టి సంతోశ్ వైపు అడుగులు వేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ లాజిక్ తెలిసిన వాళ్లకు సంతోశ్ వరస సినిమాలు చేయడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు.