Hook Step Song | మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నప్పటికీ, ఒక పాట మాత్రం ప్రత్యేకంగా థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అదే చిరంజీవి ఎనర్జీతో చేసిన హుక్ స్టెప్ సాంగ్. వింటేజ్ చిరు లుక్, మొబైల్ లైట్ కాన్సెప్ట్‌తో చేసిన స్టెప్స్ ప్రేక్షకుల్లో గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.ఈ పాట వచ్చిన ప్రతీసారి థియేటర్లలో విజిల్స్, డాన్స్‌లు మొదలవుతున్నాయి. అభిమానులు కుర్చీల్లో కూర్చోలేకుండా పూనకాలతో స్పందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సాంగ్‌కు ‘ఆట’ ఫేం సందీప్ కొరియోగ్రఫీ చేయగా, రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్‌కు బాబా సెహగల్ వాయిస్ ఇచ్చారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఈ పాటకు మరింత ఎనర్జీ జోడించింది. మూవీని థియేటర్లో చూసిన సందీప్, హుక్ స్టెప్ సమయంలో ప్రేక్షకుల స్పందన చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ హుక్ స్టెప్ వెనుక ఒక ఆసక్తికర కథ ఉందని సందీప్ తెలిపారు. పాటకు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న సమయంలో వరుసగా ఈఎంఐ రిమైండర్ కాల్స్ రావడంతో తీవ్ర ఇరిటేషన్ వచ్చిందన్నారు. సాధారణంగా కంపోజింగ్ సమయంలో ఫోన్ దూరంగా ఉంచే తాను, ప్రొడక్షన్ కాల్ కోసం సెల్ తీసుకెళ్లడంతో ఆ సమస్య ఎదురైందని చెప్పారు.కోపంతో ఫోన్ పగలగొట్టాలనుకున్న సమయంలో, అదే మొబైల్ చేతిలో ఉండగానే ఒక కొత్త ఐడియా వచ్చిందన్నారు. వెంటనే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, కేవలం మొబైల్ లైట్‌తోనే హుక్ స్టెప్ డిజైన్ చేశానని తెలిపారు. ఆ స్టెప్ చూసి తన భార్య కూడా చప్పట్లు కొట్టడంతో, దానిని ఇంకా మెరుగుపరిచి ఫైనల్ వెర్షన్‌కు తీసుకొచ్చామని చెప్పారు.
సాంగ్ షూటింగ్ పూర్తైన తర్వాత చిరంజీవి తనను పిలిచి, “నిన్ను ఎంపిక చేసినందుకు గర్వంగా ఉంది. నీ వల్ల నాకు మంచి పేరు వచ్చేలా ఉంది” అని అన్న మాటలు తన జీవితంలో మర్చిపోలేనివని సందీప్ చెప్పారు. చిరంజీవి తనపై నమ్మకం పెట్టుకుని అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడే వారికి అవకాశం ఇవ్వడమే మెగాస్టార్ తత్వమని అన్నారు. ఇక ప్రీమియర్లతోనే ‘మన శంకరవరప్రసాద్ గారు’ సుమారు రూ.25 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. బుక్‌మైషోలో 24 గంటల్లోనే 2.86 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రీమియర్స్‌లో వన్ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంటర్ అయిన చిరంజీవి రెండో చిత్రంగా ఇది నిలిచింది. మొత్తంగా చూస్తే… ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, వింటేజ్ చిరు స్టైల్‌తో, ఒక సింపుల్ ఐడియా నుంచి పుట్టిన హుక్ స్టెప్‌తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఈ సంక్రాంతికి థియేటర్లలో నిజమైన పండగను తీసుకొచ్చిందని అభిమానులు అంటున్నారు.