Hit 3 Success Party | టాలీవుడ్ యువ దర్శకులంతా ఒకేచోట కలిశారు. నాని హిట్ 3 సినిమా విజయం కావడంతో దర్శకుడు శైలేష్ కొలను గ్రాండ్ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి తండేల్ దర్శకుడు చందు మొండేటితో పాటు అంటే సుందరానికి దర్శకుడు వివేక్ ఆత్రేయా, శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సానా, జాతిరత్నలు దర్శకుడు కేవీ అనుదీప్, బేబీ దర్శకుడు సాయి రాజేష్, టక్ జగదీశ్ దర్శకుడు శివ నిర్వాణ, విశ్వంభర దర్శకుడు వశిష్ట తదితరులు ఈ వేడుకకు వచ్చి సందడి చేశారు.
ఎన్నో రోజులుగా కలవాలని అనుకుంటున్నాం, హిట్ 3 సినిమా విజయాన్ని మీతో పంచుకోవడం కంటే మంచి సందర్భం మరొకటి ఉండదు. నాకు బాగోలేనప్పుడు అండగా నిలిచిన ఈ వ్యక్తులతో నా సంతోషాన్ని పంచుకోవడం చాలా గొప్పగా ఉంది. మీకు తెలియకపోవచ్చు, కానీ మా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని (TFI) దర్శకులందరం ఒకరితో ఒకరం టచ్లో ఉంటాం, ఒకరినొకరు చూసుకుంటాం, అందరం క్షేమంగా ఉన్నామో లేదో తెలుసుకుంటాం. మేము కలిసి సినిమాలు చేసుకుంటాం, ఇది మా కుటుంబం. అంటూ శైలేష్ రాసుకోచ్చాడు.
‘హిట్- 3’ (హిట్ : ది థర్డ్ కేస్) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి రూ.150 కోట్ల దిశగా దూసుకెళుతుంది.