సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ తీసుకోవడం వేరు.. రావడం వేరు. గ్యాప్ తీసుకోవడం హీరో ఆప్షన్. రావడం పరిస్థితుల ప్రభావం. ఏదైతేనేం ఈ ఏడాది మన అగ్రహీరోలు వెండితెరకు ముఖం చాటేశారు! వారి కారణాలు వారికున్నాయి. కానీ, వారిని అభిమానించే ప్రేక్షకులకు మాత్రం 2025 నిరాశ మిగిల్చింది.
2025 చివర్లోకి వచ్చేశాం. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరమూ ఎన్నో మధురస్మృతులను అందించింది. కొన్ని విషాదాలనూ మిగిల్చింది. మిగతా రంగాల సంగతి అటుంచితే.. తెలుగు ప్రేక్షకుడికి మాత్రం 2025 అంతగా నచ్చలేదనే అనుకోవాలి. 2024 సంవత్సరంలా ఆల్ ఇండస్ట్రీస్‌ను షేక్ చేసే సినిమా ఈ ఏడాది వెండితెరపై మెరవలేదనే చెప్పాలి. కొందరు హీరోల అభిమానులకు 2025 మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయింది. మెగాస్టార్ మొదలుకొని ప్రభాస్ వరకు పలువురు స్టార్ హీరోల సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా 2025లో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఏడాది ముగుస్తున్న వేళ.. తెరపై మెరవని తారల సంగతేంటో ఒక లుక్కేద్దాం..
ఈ రోజుల్లో సినిమా నిర్మాణానికి ఏండ్ల తరబడి సమయం పడుతున్నది. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కే నెలలు కేటాయిస్తున్నారు. అట్టహాసంగా మొదలయ్యే షూటింగ్‌కు ఎప్పుడు క్లాప్ పడుతుందో దర్శకుడు కూడా అంచనా వేయలేకపోతున్నాడు. తీరా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశాక కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎన్నాళ్లు సాగుతాయో అస్సలు క్లారిటీ ఉండటం లేదు. సీజీ వర్క్ పేరుతో.. నెలలు గడిచిపోతున్నాయి. ఫలితంగా షూటింగ్ పూర్తయిన సినిమాలు కూడా సమయానికి విడుదల కాలేకపోతున్నాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద హీరోల సినిమాలు లేకుండానే 2025 తరలి పోతున్నది. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలకు 2025 నాన్ పర్ఫార్మింగ్ ఇయర్‌గా మిగిలిపోయింది. వారి అభిమానులకు నిరాశ మిగిల్చింది.
రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి మంచి జోరు మీద కనిపించాడు. మధ్యలో ఒకట్రెండు గ్యాప్‌లు తీసుకున్నా.. 2022లో ఆచార్య, గాడ్‌ఫాదర్ సినిమాలు, 2023లో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ చిత్రాలతో వరుసగా రెండేండ్లు రెండేసి సినిమాలతో అభిమానులను అలరించాడు మెగాస్టార్. ‘భోళా శంకర్’ డిజాస్టర్‌తో చిరు వేగానికి బ్రేక్ పడినట్టు అయింది. ఫలితంగా 2024, 2025లో చిరు సినిమా ఒక్కటీ రిలీజ్ కాలేదు. ఈ రెండేండ్లలో చిరంజీవి కాల్షీట్లు ఖాళీగా లేనంత బిజీగా షూటింగ్స్‌లో పాల్గొన్నాడు. పలు చిత్రాలకు ఓకే కూడా చెప్పాడు. కానీ, రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి కాలం కలిసిరాలేదు. వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ ఈ ఏడాది వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకున్నారంతా!
వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇక ఆ సినిమా గురించి ఆలోచించడమే మానేశారు అభిమానులు. ఈలోపు అనిల్ రావిపూడి చిత్రాన్ని ఓకే చేశాడు చిరు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌నూ పెట్టారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ పండుగకి వస్తున్నారంటూ 2026 సంక్రాంతి రేసుకు సిద్ధమయ్యాడు మెగాస్టార్. ‘విశ్వంభర’ కూడా 2026 వేసవిలో వస్తుందని టాక్. ఈ లెక్కన రెండేండ్లు గ్యాప్ తీసుకున్న చిరంజీవి.. వచ్చే సంవత్సరం కనీసం రెండుసార్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో నిర్మాణ దశలో ఉన్న సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. అదే నిజమైతే మెగాభిమానులకు పండుగే!

ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించని మరో హీరో మహేశ్‌బాబు. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’లో భాగం కావడంతో వచ్చే ఏడాది కూడా మహేశ్ వెండితెరకు దూరంగా ఉన్నట్టే! జక్కన్న అయితే ‘వారణాసి’ 2027లో విడుదల చేస్తామని ప్రకటించాడు. కానీ, రిలీజయ్యే వరకు నమ్మే ముచ్చట కాదు. ఈ క్రమంలో 2024లో ‘గుంటూరు కారం’తో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన మహేశ్ తన కెరీర్లో మొదటిసారి ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. 2010 నుంచి 2021 వరకు వరుసగా పదకొండేండ్లు ఏడాదికోసారి (2014లో రెండు సినిమాలు) ప్రేక్షకులను పలకరించిన మహేశ్ తర్వాత రెండేండ్లకు ఒకసారైనా ఒక సినిమాతో ముందుకొచ్చాడు. 2024లో త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య ‘గుంటూరు కారం’ విడుదలైంది.
ఆ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో.. ఆయన అభిమానులు ఉసూరుమన్నారు. ఈలోపు జక్కన్న ప్రాజెక్టు కన్ఫర్మ్ కావడంతో కనీసం మూడేండ్ల గ్యాప్ అనివార్యమైంది. పాన్ వరల్డ్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ‘వారణాసి’లో రుద్ర పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నాడు. ఇటీవల జరిగిన వారణాసి ‘గ్లోబల్ ట్రాటర్’ ఈవెంట్ సక్సెస్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఎంత ఆలస్యమైనా జక్కన్న, మహేశ్ కాంబోలో వచ్చే సినిమా ఓ రేంజ్లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అదే సమయంలో రెండేండ్లుగా మిస్సవుతున్న తమ హీరోను చూడాలంటే మరో రెండేండ్లు ఎదురుచూడాల్సి రావడమే వారికి మింగుడుపడటం లేదు.
ఏటా సినిమాలు చేసే హీరో కాదు ప్రభాస్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. తర్వాత సాహో, రాధేశ్యామ్ భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అయినా మనోడికున్న క్రేజ్ తగ్గలేదు. 2023లో ‘సలార్’తో తన సత్తా చాటాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ మూవీ ‘కల్కి’తో గ్యాప్ లేకుండా మరుసటి ఏడాదే ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా రికార్డు కలెక్షన్లు వసూలు చేసి ప్రభాస్ మానియా ఇంకా తగ్గలేదని నిరూపించింది.
తర్వాత తన స్టార్‌డమ్‌ను సవాలు చేస్తూ కామెడీ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకున్నాడు. మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమా చేశాడు. అన్ని పనులూ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2026 సంక్రాంతి రేసుకు కిక్కివ్వడానికి సిద్ధమైంది. అయితే 2025లో ప్రభాస్ నటించిన ఫుల్ఫ్లెడ్జ్ సినిమా ఏదీ విడుదల కాలేదు. మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమాలో రుద్రగా… అతిథి పాత్రలో అలరించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో.. ప్రభాస్ గెస్ట్
అప్పీరియెన్స్ నిష్ఫలమైంది.
రెగ్యులర్‌గా సినిమాలు చేసే హీరో జూనియర్ ఎన్టీయార్. 2010 నుంచి 2018 వరకు ఏడాదికో సినిమా చొప్పున ప్రేక్షకులను పలకరించాడు ఆయన. తర్వాత రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పట్టాలకెక్కింది. కరోనా ఎఫెక్ట్‌తో నాలుగేండ్ల గ్యాప్ తర్వాత 2022లో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైంది. రెండేండ్ల గ్యాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ పార్ట్ 1 2024లో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. 2025లో జూనియర్ ఎన్టీయార్ డైరెక్ట్ తెలుగు సినిమా విడుదల కాలేదు. హృతిక్‌రోషన్‌తో కలిసి చేసిన హిందీ చిత్రం ‘వార్ 2’ ఈ ఏడాది విడుదలైంది. అలా టాలీవుడ్ హీరో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన నటన, డ్యాన్స్‌తో హిందీ ప్రేక్షకులను అలరించాడు జూనియర్ ఎన్టీయార్. అయితే, ఈ ఏడాది దేవర 2 రిలీజ్ అవుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పట్టాలెక్కడంతో దేవర 2పై క్లారిటీ మిస్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా 2027లో విడుదల అవుతుందని అంచనా! దీంతో జూనియర్ ఎన్టీయార్‌కి మూడేండ్ల గ్యాప్ తప్పడం లేదు.
పుష్ప సీక్వెల్స్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ 2025లో తెరపై కనిపించలేదు. 2024 డిసెంబర్ 5న మొదలైన ‘పుష్ప-2’ మేనియా 2025లోనూ కొనసాగింది. అయితే, ఈ ఏడాది ఆయన సినిమా ఏదీ షూటింగ్ దాకా కూడా వెళ్లలేదు. 2023లో జవాన్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు అట్లీ డైరెక్షన్లో చిత్రానికి ఓకే చేశాడు అల్లు అర్జున్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. 2028లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని దర్శకుడి మాట. ఆ లెక్కన పుష్పకు నాలుగేండ్ల గ్యాప్ ఖాయంగా కనిపిస్తున్నది.
గ్యాప్‌లు ఎక్కువగా తీసుకోని హీరోగా అక్కినేని నాగార్జునకు పేరుంది. అయితే, వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న నాగ్ ఈ ఏడాది నటుడిగా బిజీగానే ఉన్నాడు. కానీ, హీరోగా మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయాడు. 2022లో హీరోగా రెండు సినిమాల్లో కనిపించిన నాగ్ బంగార్రాజుతో మంచి సక్సెస్‌నే అందుకున్నాడు. 2024 సంక్రాంతి బరిలో ‘నా సామిరంగా’ అంటూ ముందుకొచ్చాడు. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో కెరీర్లో కాస్త వెనుకబడ్డాడు. ఇక ఈ ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించాడు నాగార్జున. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కూలీ’ చిత్రంలో తొలిసారిగా విలన్‌గా కనిపించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచినా.. నాగార్జున పాత్రకు పెద్దగా క్రెడిట్ దక్కలేదు. మొత్తంగా ఈ ఏడాది నాగార్జున హీరోగా ప్రేక్షకులను పలకరించలేదన్న నిరుత్సాహంలో ఉన్నారు అక్కినేని అభిమానులు.