Siddharth | కథానాయిక అదితిరావు హైదరీతో గత నెలలో జరిగిన తన వివాహ నిశ్చితార్థంపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందించారు. మార్చి 27న ఈ జంట నిశ్చితార్థ వేడుక వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో ఇరు కుటుంబాల సన్నిహితుల సమక్షంలో అత్యంత గోప్యంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
తాజాగా తన నిశ్చితార్థంపై ఓ అవార్డుల వేడుకలో పాల్గొన్న సిద్థార్థ్ స్పందించారు. ‘అందరూ అనుకుంటున్నట్లుగా అది సీక్రెట్ ఎంగేజ్మెంట్ కాదు. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మాది ప్రైవేట్ ఎంగేజ్మెంట్. కొద్దిమంది కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించాం. ఆహ్వానం లేనివాళ్లు సీక్రెట్ ఫంక్షన్గా భావిస్తున్నారు. నిశ్చితార్థంలో ఎలాంటి గోప్యత లేదు. ఏం చేసినా పెద్దల నిర్ణయం ప్రకారమే జరుగుతుంది’ అని సిద్ధార్థ్ చెప్పారు. ‘మహా సముద్రం’ చిత్రంలో సిద్ధార్థ్, అదితిరావు హైదరీ తొలిసారి కలిసి పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు.