ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటించిన చిత్రం ‘వేద’. హర్ష దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని అదే పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాత వీఆర్ కృష్ణ మండపాటి. నేడు ఈ సినిమా విడుదలవుతున్నది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘శివరాజ్ కుమార్ కుటుంబంతో నాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ఈ సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. దర్శకుడు హర్ష గత చిత్రాల్లాగే మంచి మూవీ తెరకెక్కించాడు. విజువల్స్, సంగీతం బాగున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ మంచి విజయం సాధించాలి’ అన్నారు. శివరాజ్ కుమార్ మాట్లాడుతూ..‘బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణిలో ఓ పాటలో కనిపించాను. ఆయనతో కలిసి ఓ పూర్తి స్థాయి పాత్రలో నటించాలని ఉంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక స్నేహపూర్వక వాతావరణం ఉంది. ఇకపై నేను నటించే ప్రతి సినిమా అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేస్తాము. వినోదంతో పాటు సందేశం ఉన్న చిత్రమిది. ప్రతి ఒక్కరినీ అనుభూతికి లోనుచేస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.