పరిపూర్ణత, బహుముఖ ప్రజ్ఞ.. ఈ రెండూ అడివి శేష్‌కి అలంకారాలు. అందుకే ఆయన్నంతా పర్ఫెక్షనిస్ట్ అంటుంటారు. క్షణం, గూఢచారి, మేజర్, హిట్ 2.. ఈ చిత్రాల దర్శకులెవరైనా.. వీటి విజయాల వెనుక అడివి శేష్ పాత్ర మాత్రం కీలకం. 24క్రాఫ్ట్స్ లోని అన్ని విభాగాలపై అవగాహన ఉన్న అతికొద్దిమంది నటుల్లో అడివిశేష్ ఒకరు. రాశి కన్నా వాసి ముఖ్యమనే సిద్ధాంతాన్ని తూచ తప్పక పాటిస్తారాయన. అందుకే ఆయన సినిమాలు ఆలస్యమవుతూవుంటాయి. ఆయన హీరోగా, షానియల్ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ‘డెకాయిట్’ చిత్రం ఈ నెల 10న విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో అడివి శేష్ విలేకరులతో ముచ్చటించారు.
ఒకరోజు నాకో ఆలోచన వచ్చింది. ఓ బిజీ రోడ్ పైన ఓ కాంక్రిట్ ఫుట్‌పాత్. దానికి ఉన్న చిన్న క్రాక్ నుంచి ఒక చిన్న పువ్వు బయటికి వస్తే? ఈ విజువల్ ఇమాజినేషన్ నుంచే ‘డెకాయిట్’ కథ పుట్టింది. ఓ తీవ్రమైన కోపం చుట్టూ అల్లుకున్న ప్రేమకథగా ‘డెకాయిట్’ని తయారు చేశాం. ఇప్పటివరకూ నేను చేసిన యాక్షన్ సినిమాల్లో ఓ చిన్నభాగం ప్రేమకథను చూశారు. కానీ ‘డెకాయిట్’ అందుకు పూర్తి భిన్నం. ఇది కంప్లీట్ లవ్‌స్టోరీ. నా గత చిత్రాలను దృష్టిలో పెట్టుకొని, యాక్షన్ సినిమాలో లవ్ చూడటానికి ఈ సినిమాకు రావొద్దు. లవ్‌స్టోరీలో యాక్షన్ చూడటానికి రండి.. అంతా హ్యాపీగా ఫీలవుతారు. ఇందులో భావోద్వేగాలన్నీ సహజంగా ఉంటాయి. మృణాళ్ ఠాకూర్ అద్భుతమైన నటి. ఆమెతో నటించడం గొప్ప అనుభవం. అలాగే అనురాగ్ కశ్యప్, ప్రకాశ్‌రాజ్ వంటి లెజెండ్స్ ఈ పానిండియా సినిమాకు పనిచేశారు.
ఇందులో నేను పోషించిన హరి పాత్ర నా గత చిత్రాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. తను ఏ విషయాన్నయినా మొహం మీదే మాట్లాడతాడు. ఆనందాన్నీ, ఆగ్రహాన్నీ దాచుకోడు. అందుకే ఈ పాత్ర కోసం సహజంగా నాలో ఉన్న లిమిటేషన్స్ని దాటాను. ఎప్పుడు లేనిది డ్యాన్సులు కూడా చేశాను. పాత్ర కోసమే మదనపల్లి యాస అలవాటు
చేసుకున్నా. ఇక మ్యూజిక్ విషయానికొస్తే.. భీమ్స్ చాలా ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చారు. ‘రుబారు’ సాంగ్ రెహమాన్ పాటలా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి. ఇక ‘హలో బ్రదర్’లోని ఐకానిక్ సాంగ్ ‘కన్నెపిట్టరో కన్నుగొట్టరో..’ సరైన సందర్భంలో ఒకేసారి వస్తుంది. ఇదే ప్లేస్‌లో హిందీలో ‘చీజ్ బడీ హే మస్తు మస్తు’ సాంగ్ ఉంటుంది. పోలాకి విజయ్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు హైలైట్. సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా ఆకట్టుకుంటంది.
నేనెప్పుడూ బిజీగానే ఉంటాను. కానీ నా సినిమాలు లేట్ అవుతూవుంటాయి. నేను సినిమా చేసే తీరు అలా ఉంటుంది. వరుసగా సినిమాలు చేయాలంటే నాలో ఉన్న రచయితను పక్కన పెట్టాలి. ప్రస్తుతం ‘గూఢచారి 2’ షూటింగ్ జరుగుతున్నది. ఆ సినిమా తర్వాత వేరేవారి విజన్‌లో కూడా.. వేలు పెట్టకుండా వర్క్ చేయాలనుకుంటున్నా. అప్పుడైతే ఎక్కువ సినిమాలు చేయగలనని నా అభిప్రాయం.